ramesh jigajinagi: నరేంద్ర మోదీ తరుచుగా మిష‌న్‌ భగీరథ గురించి చెబుతుంటారు: కేంద్ర మంత్రి రమేష్ జిగజినాగి

  • మిషన్ భగీరథ దేశానికే రోల్ మోడల్
  • రాష్ట్రం మొత్తానికి ఏకకాలంలో మంచినీటిని అందించే ప్రాజెక్టు దేశంలో ఇదే మొదటిది
  • మిషన్ భగీరథ పనులు చూడడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను
  • పార్లమెంట్ సమావేశాల తర్వాత భగీరథ పనులు చూడడానికి వస్తాను

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న మిషన్ భగీరథ దేశానికే రోల్ మోడల్ అని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి రమేష్ జిగజినాగి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరుచుగా మిష‌న్‌ భగీరథ గురించి తమ దగ్గర ప్రస్తావిస్తుంటారని చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్య పథకాలపై కేంద్రమంత్రి రమేష్ జిగజినాగి హైదరాబాద్ హోటల్ ప్లాజాలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ తాగునీటి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ గురించి వివరాలను తెలుసుకున్న రమేష్ జిగ‌జినాగి.. తెలంగాణలో ఆయా పథకాలు అమలవుతున్న తీరును ప్రశంసించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు మిషన్ భగీరథ పథకం గొప్పతనం గురించి తరుచుగా మాట్లాడుతుంటారని చెప్పారు.

ఏకకాలంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించడమన్నది దేశంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈ మహాయజ్ఞం పనులను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. మిషన్ భగీరథ పనులను చూడడానికి పార్లమెంట్ సమావేశాల తర్వాత కచ్చితంగా వస్తాననన్నారు. ఒక రోజంతా ఇందుకు కేటాయిస్తాన‌న్నారు.


తాగునీటి సరఫరా గ్రావిటీతో చేయడం బాగా ఆకట్టుకుంటోంది..
మిషన్ భగీరథలో అధికశాతం తాగునీటి సరఫరా గ్రావిటీతో చేయడం తనను బాగా ఆకట్టుకుందన్నారు. రాష్ట్రంలో రోజుకు పదివేల మరుగుదొడ్లను నిర్మిస్తున్నారని తెలుసుకున్న కేంద్రమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. తన నుంచి ఎలాంటి సహాయం కావాలన్న చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎన్ఆర్‌డీడ‌బ్యూపీ కన్సల్టెంట్ నర్సింగరావు, రంగారెడ్డి జిల్లా ఎస్.ఈ ఆంజనేయులు, ఈఈలు విజయ్ కుమార్, నరేందర్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Telugu News