facebook: తాత్కాలికంగా 'అన్‌ఫ్రెండ్' చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించిన ఫేస్‌బుక్‌!

  • 'స్నూజ్' ఆప్ష‌న్ ద్వారా అందుబాటులోకి
  • 30 రోజుల పాటు అన్‌ఫ్రెండ్ చేసుకునే అవ‌కాశం
  • శాశ్వ‌తంగా అన్‌ఫ్రెండ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు

సోష‌ల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో కొంత‌మంది త‌ర‌చూ పోస్టులు చేస్తుంటారు. దీని వల్ల టైమ్‌లైన్ మొత్తం వారి పోస్టులే క‌నిపిస్తుంటాయి. పోనీ వారిని అన్‌ఫ్రెండ్ చేద్దామా అంటే.. మ‌ళ్లీ ఏదైనా అవ‌స‌రం వ‌చ్చిన‌పుడు తిరిగి ఫ్రెండ్‌గా యాడ్ చేసుకోవ‌డం పెద్ద‌ప‌ని. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కోసం ఫేస్‌బుక్ ఓ కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

దీని ద్వారా తాత్కాలికంగా ఫ్రెండ్‌ను అన్‌ఫ్రెండ్ లేదా అన్‌ఫాలో చేయ‌వ‌చ్చు. అంటే వారి పోస్టులు టైమ్‌లైన్‌లో క‌నిపించ‌కుండా చేయ‌వ‌చ్చు. 'స్నూజ్‌' అనే పేరుతో ఫేస్‌బుక్ ఈ ఆప్ష‌న్‌ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా ఫేస్‌బుక్‌లో వ‌రుస‌గా పోస్టులు చేస్తూ ఇబ్బంది పెడుతున్న‌ కొంతమంది స్నేహితుల‌ను అన్‌ఫ్రెండ్‌ చేయకుండానే వారి పోస్టులను తాత్కాలికంగా అంటే క‌నిష్టంగా ఒక రోజు, గ‌రిష్టంగా 30రోజులపాటు నిరోధించే అవకాశం క‌లుగుతుంది. గ్రూపులు, పేజీల‌కు కూడా ఈ ఆప్ష‌న్ వ‌ర్తిస్తుంది. అన్‌ఫోలో, హైడ్‌, రిపోర్ట్‌, సీ ఫస్ట్ ఆప్ష‌న్ల‌తో పాటు ఈ ఆప్ష‌న్‌ను జ‌త చేసింది. 30 రోజుల అనంతరం 'తాత్కాలిక వ్యవధి' ముగిసే సమయానికి ఫేస్‌బుక్‌ నోటిఫికేషన్‌ ఇస్తుంది. అప్పుడు వారి పోస్టులు తిరిగి పొందాలనుకుంటే  పునరుద్ధరించుకోవచ్చు, లేదంటే మరో 30 రోజుల పాటు అదే ఆప్షన్‌ ను కొనసాగించవచ్చు.

More Telugu News