KCR: ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటుకు సీఎం నిర్ణయం.. నేడో, రేపో ఉత్తర్వులు

  • భూపతిరెడ్డి- ఎమ్మెల్యే గోవర్థన్‌కు మధ్య తారస్థాయికి చేరుకున్న విభేదాలు
  • పార్టీ మారేందుకు భూపతిరెడ్డి యత్నాలు
  • నేతల సిఫార్సుతో వేటుకు సిద్ధమైన సీఎం కేసీఆర్

నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ ఆర్.భూపతిరెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. నేడు, లేదంటే రేపు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా మిగతా వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయనున్నారు. భూపతిరెడ్డిపై వేటేస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ స్థాయి ప్రజాప్రతినిధిపై వేటు వేయడం ఇదే తొలిసారి కానుంది.

ఎమ్మెల్యే టికెట్ విషయంలో 2014లో బాజిరెడ్డి గోవర్థన్‌కు, భూపతిరెడ్డికి మధ్య విభేదాలున్నాయి. నిజామాబాద్ రూరల్ నుంచి టికెట్ ఆశించిన భూపతిరెడ్డిని కాదని అధిష్ఠానం గోవర్థన్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన భూపతిరెడ్డిని 2016లో ఎమ్మెల్సీని చేశారు. ఆ తర్వాత భూపతిరెడ్డి, గోవర్థన్‌రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు అధిష్ఠానం ప్రయత్నించినా వీలుకాలేదు.

అధిష్ఠానం హెచ్చరికలను భూపతిరెడ్డి బేఖాతరు చేయడం, మరో పార్టీలోకి వెళ్లేందుకు రెండు పార్టీల నేతలతో మంతనాలు సాగించిన విషయాన్ని తెలుసుకున్న నేతలు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సిఫారుసును పరిగణనలోకి తీసుకున్న సీఎం భూపతిరెడ్డిపై వేటుకే మొగ్గుచూపారు. ఆయనపై వేటు వేయడం ద్వారా పార్టీలో క్రమశిక్షణ తప్పుతున్న వారికి హెచ్చరికలు జారీ చేయాలని నిర్ణయించారు. 

More Telugu News