India: విరాట్ లేని టీమ్... తలొగ్గేనా? ప్రతీకారం తీర్చుకునేనా?

  • సిరీస్ లో నిలవాలంటే గెలవాల్సిందే
  • తొలి వన్డేలో దారుణంగా ఓటమి
  • నేడు మొహాలీలో రెండో వన్డే

ధర్మశాలలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా భారత క్రికెట్ జట్టు ఓపక్క.. అదే ఊపును కొనసాగిస్తూ, సిరీస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో శ్రీలంక జట్లు మరోపక్క నేడు మొహాలీ వేదికగా రెండో వన్డేలో తలపడనున్నాయి. భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరుతో ఏర్పడిన లోటు స్పష్టంగా తెలుస్తుండగా, బౌలింగ్ పరంగా మంచి లైనప్ తో ఉన్న లంకేయులు మరోసారి భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.

తొలి వన్డేలో దారుణాతి దారుణంగా 112 పరుగులకే పరిమితమైన టీమిండియా, ఈ వన్డేలో గెలిచి తిరిగి గాడిలోకి రావాలని భావిస్తోంది. సిరీస్ ను గెలుచుకునే ఆశలు నిలుపుకోవాలంటే, ఈ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందే. ఇక ధర్మశాలలోని పిచ్ మాదిరిగానే పేస్ బౌలింగ్ కు అనుకూలించే మొహాలీ పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవని అంచనా. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ను తీసుకునే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్ లో లేకపోవడం, స్పిన్నర్లు కులదీప్, చాహల్ లు రాణించడంలో విఫలం అవుతుండటం భారత జట్టు ముందు పెను సవాళ్లుగా మారాయి. ఇక జట్టులో ఉన్నా తొలి వన్డేలో పెవిలియన్ కే పరిమితమైన రహానే, ఈ మ్యాచ్ లోనైనా తుది జట్టులో ఉంటాడా? అన్నది వేచి చూడాల్సిందే. ఇరు జట్లూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.

More Telugu News