Doklam: మళ్లీ డోక్లాంలోకి... తిష్టవేసిన 1800 మంది చైనా సైనికులు!

  • మళ్లీ ట్రై జంక్షన్ ప్రాంతంలో చైనా సైనికులు
  • హెలిపాడ్లు సిద్ధం, రహదారుల విస్తరణ పనులు మొదలు
  • మళ్లీ ఉద్రిక్త వాతావరణం

భారత్, భూటాన్, టిబెట్ దేశాల ట్రై జంక్షన్ ప్రాంతం డోక్లాంలో మరోసారి చైనా సైనిక బలగాలు తిష్ట వేశాయి. శీతాకాల క్యాంపని చెబుతూ, సుమారు 1800 మంది సైనికులు ట్రై జంక్షన్ ప్రాంతానికి చేరుకున్నారు. రెండు హెలిపాడ్లను ఇప్పటికే నిర్మించిన వారు, రహదారుల విస్తరణ పనులను మొదలు పెట్టారని తెలుస్తోంది. తాత్కాలిక గుడిసెలు, గడ్డ కట్టించే చలిలో తాము ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఈ సంవత్సరం ఆరంభంలో ఇదే ప్రాంతంలో నూతన రహదారిని చైనా చేపట్టిన వేళ, తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడగా, భారత్, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ ఇరు దేశాల సైన్యమూ భారీ ఆయుధాలను తరలిస్తూ యుద్ధ భయాన్ని పెంచాయి కూడా. ఎదురుపడినప్పుడల్లా, ఒకరిని ఒకరు తోసుకుంటున్న చైనా, భారత్ సైనికుల దృశ్యాలు అప్పట్లో ఆందోళన కలిగించాయి. ఈ భూభాగం తమదని చైనా, కాదని భారత్ వాదిస్తుండటంతో సమస్య సద్దుమణగలేదు. ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్న తరువాత, రెండు దేశాల సైనికులూ వెనక్కు వెళ్లగా, ఇప్పుడు తాజాగా చైనా మరోసారి తన ప్రయత్నాలు మొదలు పెట్టింది.

More Telugu News