Gas: ఈ నెల గ్యాస్ ధర అందుకే పెరగలేదట.. 17 నెలల తర్వాత తొలిసారి!

  • 17 నెలలుగా ధరలు పెంచుతున్న చమురు కంపెనీలు
  • మొత్తం రూ.76.5 పెరిగిన వైనం
  • ఈ నెలకు వదిలేసిన ఆయిల్ కంపెనీలు
  • గుజరాత్ ఎన్నికలే కారణమా?

సాధారణంగా ప్రతీనెల పెరుగుతూ వస్తున్న గ్యాస్ ధరలు ఈ నెలలో స్థిరంగా ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ధరలు ఎందుకు పెరగలేదన్న దానికి మాత్రం అధికారుల వద్ద సమాధానం లేదు. చమురు కంపెనీలు గత 17 నెలల్లో 19 సార్లు గ్యాస్ ధరలను పెంచాయి. సిలిండర్‌పై మొత్తంగా 76.5 పెరిగింది. అయితే ఈనెలలో మాత్రం చమురు కంపెనీలు ధరల పెంపు జోలికి వెళ్లలేదు. దీనికి కారణం గుజరాత్ ఎన్నికలేనని చెబుతున్నారు. అయితే అధికారికంగా మాత్రం ప్రభుత్వం ఏ విషయమూ చెప్పడం లేదు.

ప్రతీ నెల ఎంతో కొంత పెంచుతూ వస్తున్న ప్రభుత్వం వచ్చే ఏడాది నాటికి వంట గ్యాస్‌పై ప్రస్తుతం ఉన్న రాయితీని పూర్తిగా ఎత్తివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలు గతేడాది జూలై నుంచి ప్రతి నెల 1న ధరలు పెంచుతూ వస్తున్నాయి. అయితే ఈనెలలో మాత్రం ధరల పెంపుదల విషయాన్ని పక్కనపెట్టాయి. ఈ విషయమై ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ధరలు పెంచకపోవడమనేది చాలా సాధారణ విషయమంటూ సమాధానం దాటవేశారు.

గత నెలలో సిలిండర్‌పై రూ.4.50 పెరగడంతో రూ.495.69కి చేరుకుంది. కాగా, ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌పై ప్రభుత్వం రూ.251.31లను సబ్సిడీగా చమురు కంపెనీలకు చెల్లిస్తోంది.  

More Telugu News