Sanjay Leela Bhansali: ‘పద్మావతి’ కంటే శాంతిభద్రతలే ముఖ్యమంటున్న గోవా సీఎం

  • సినిమాను నిషేధించాలన్న డిమాండ్ ను పరిశీలిస్తాం
  • సెన్సార్ అనుమతి వచ్చిన తర్వాతే ఓ నిర్ణయం
  • అవసరమైతే వివాదాస్పద అంశాలకు కత్తెర

విడుదలకు ముందే వివాదాస్పదంగా మారిన పద్మావతి సినిమాపై గోవా రాష్ట్రం నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర సీఎం మనోహర్ పారికర్ వ్యాఖ్యలే నిదర్శనం. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా కొనసాగుతున్న గోవా రాష్ట్రం శాంతి, భద్రతల సమస్యలను భరించే స్థితిలో లేదని మనోహర్ పారికర్ పేర్కొన్నారు. ఈ దృష్ట్యా సంజయ్ లీలా భన్సాలీ చిత్రమైన పద్మావతిని రాష్ట్రంలో ప్రదర్శించకుండా నిషేధించాలన్న బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ ను పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

ఈ సినిమాను నిషేధించాలని కోరుతూ బీజేపీ మహిళా విభాగం ప్రతినిధులు ఇప్పటికే ముఖ్యమంత్రిని కలసి కోరడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాలేదని, అది వచ్చిన తర్వాత తాము ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే సినిమాలో వివాదాస్పద అంశాలను తొలగించడం జరుగుతుందన్నారు. ‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే చరిత్రను సరైన రీతిలో చూపించాలి. తప్పుడు మార్గంలో దాన్ని చిత్రీకరిస్తే ప్రజల మనోభావాలు గాయపడతాయి’’ అని పారికర్ పేర్కొన్నారు.

More Telugu News