Jagan Mohan Reddy: సోనియాగాంధీతో తేడా అక్కడొచ్చింది.. గుట్టువిప్పిన జగన్!

  • ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు
  • నేనైతే ప్రజలకు ఇచ్చిన మాటకే కట్టుబడాలని నిర్ణయించుకున్నా
  • అసలు ఓదార్పు యాత్రకు ఆమె పర్మిషన్ ఏంటో ఇప్పటికీ ఆశ్చర్యమే

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన పరిస్థితులను వివరించారు. సోనియాగాంధీతో ఏర్పడిన వివాదానికి గల కారణాలను బయటపెట్టారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో విభేదాలు రావడానికి గల కారణాలను వివరిస్తూ.. సోనియా తన ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదన్నారు. ఆమెకు తన గురించి లేనిపోనివి చెప్పారో, లేక ఆమె మైండ్‌సెట్ మారిందో తెలియదు కానీ ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి ఇవ్వలేదని చెప్పారు. యాత్రకు ఉన్న సెంటిమెంటును, దానితో తనకు ఉన్న ఎమోషనల్ కనెక్ట్‌ను ఆమె అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. తాను, అమ్మ, పాప ముగ్గురం కలిసి చివరిగా ఆమెను రిక్వెస్ట్ చేసి ఒప్పించాలని వెళ్లామని, అయితే ఎంత చెప్పినా సోనియా వినలేదని వివరించారు.  అందరినీ ఒకే చోటకు పిలిపించి ఓదార్చండి అన్నారని జగన్ గుర్తు చేశారు.

సోనియా కనుక ఆరోజు ఒప్పుకుని ఉంటే సమస్య ఇంతదూరం వచ్చి ఉండేది కాదని జగన్ అన్నారు. తాము ముగ్గురం కలిసి సోనియాను పర్మిషన్ ఇవ్వమని మాత్రమే అడిగామని అన్నారు. అసలు ఓదార్పు యాత్రకు ఆమె పర్మిషన్ ఎందుకు తీసుకోవాలో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చేందుకు ఇంకొకరి అనుమతి కావాలనుకోవడమే బిగ్గెస్ట్ ఆశ్చర్యం అని జగన్ అన్నారు. సోనియా ఒప్పుకోకున్నా తానైతే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నిర్ణయించుకున్నానని, అదే విషయాన్ని అమ్మతో చెప్పానని జగన్ గుర్తు చేసుకున్నారు.

More Telugu News