mahesh kathi: మరి చిరంజీవి జనాన్ని, కులాన్ని, త‌న‌ పార్టీ వారిని మోసం చేసిన సంగ‌తి ఏంటి?: పవన్ కు మ‌హేశ్‌ క‌త్తి ప్రశ్నలు

  • త‌న‌ అన్నను, పీఆర్‌పీని మోసం చేసినవాళ్ల గురించి ప‌వ‌న్ చెప్పారు
  • జ‌న‌సేన కూడా ప్ర‌జారాజ్యం పార్టీలాగే త‌యార‌యింది
  • పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా చేశారు
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులతో మ‌ళ్లీ గొడ‌వ మొద‌లైతే ఎదుర్కోవ‌డానికి నేను సిద్ధ‌మే

 త‌న అన్న‌య్య‌ చిరంజీవికి ద్రోహం చేసిన వారిని జనసేన ద్వారా దెబ్బకొడదామ‌ని జ‌న‌సేన పార్టీ అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు విశాఖలో చేసిన వ్యాఖ్యలపై మ‌హేశ్ క‌త్తి విమర్శలు చేశారు. 'అన్న (చిరంజీవి)ను, పీఆర్‌పీని మోసం చేసినవాళ్ల సంగతి సరే... మరి అన్న గారు జనానికి, కులానికి, పార్టీకి చేసిన మోసం సంగతో..?' అంటూ మ‌హేశ్ క‌త్తి ట్వీట్ చేశారు.

కొత్త‌ర‌క్తం, కొత్త‌త‌ర‌హా రాజకీయాలు కావాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న మాట‌ల‌ను ప్ర‌స్తావిస్తూ 'పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా, ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్తతరహా రాజకీయం' అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీకి ఇక‌ మద్దతు ఇవ్వమ‌ని పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నార‌ని, 'ఇక మిగిలింది వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్...చలో' అని మ‌హేశ్‌క‌త్తి అన్నారు. తాను చేసిన ట్వీట్‌ల‌పై ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన మ‌హేశ్‌క‌త్తి.. జ‌న‌సేన కూడా ప్ర‌జారాజ్యం పార్టీలాగే త‌యార‌యింద‌ని విమ‌ర్శించారు.

విధాన‌ప‌రంగా ప్ర‌జారాజ్యం పార్టీకి, జ‌న‌సేన పార్టీకి తేడా లేద‌ని అన్నారు. త‌న‌కి, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కి మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ మొద‌లైతే ఎదుర్కోవ‌డానికి తాను ఎప్ప‌టికీ సిద్ధ‌మేన‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు త‌మ తీరును అలాగే కొన‌సాగిస్తారా? లేదంటే మార‌తారా? అన్నది వారి ఇష్ట‌మ‌ని చెప్పారు.   

More Telugu News