Pawan Kalyan: 'నా తండ్రి చనిపోయాడు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవుతా' అంటే ఎలా?: జగన్ పై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ చురకలు

  • జ‌గ‌న్ అంటే వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేక‌త లేదు
  • రాజకీయాల్లో కొంతమంది వేలకోట్ల రూపాయ‌ల‌ డబ్బును వెనకేసుకున్నారు
  • అందుకే వైఎస్సార్సీపీని వ్యతిరేకించాను

'నా తండ్రి చనిపోయాడు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవుతా అంటే ఎలా?' అని ప‌రోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌ని ఉద్దేశించి జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన జ‌న‌సేన‌ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్ మాట్లాడుతూ... త‌న‌ తండ్రి ముఖ్యమంత్రి అయితే తాను కూడా ముఖ్యమంత్రి అవుతాననడం తప్పు అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కొంతమంది వేలకోట్ల రూపాయ‌ల‌ డబ్బును వెనకేసుకున్నారని, తాను అందుకే వైఎస్సార్సీపీని వ్యతిరేకించాన‌ని తెలిపారు. అంతేగానీ, జగన్ అంటే త‌న‌కు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని చెప్పుకొచ్చారు.

కొంత‌మందికి వేల కోట్లు సంపాదించాల‌న్న పిచ్చి ఉందని, కొంత‌మందికి ఎప్పుడూ అధికారంలో ఉండాల‌నే పిచ్చి ఉంద‌ని, త‌న‌కు మాత్రం స‌మాజం బాగుండాల‌నే పిచ్చి ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగంతో కొంద‌రు సొమ్మును పోగేసుకున్నారని చెప్పారు.

జ‌న‌సేన భావ‌జాలాన్ని జ‌న‌సేన సైనికులు ముందుకు తీసుకెళ్లాల‌ని పిలుపునిచ్చారు. తాను 25 ఏళ్లు దేశం కోసం త‌న స‌ర్వ‌స్వం ధార‌పోస్తాన‌ని చెప్పుకొచ్చారు. రాజకీయ నాయ‌కుల పిల్లలు రాజకీయాల్లోని రాకూడదని తాను చెప్పడం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. నిజాయతిని నిరూపించుకుని అప్పుడు రాజ‌కీయాల్లోకి రావాలని అన్నారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదని చెప్పుకొచ్చారు. తాను ప్రజా సేవ చేస్తానని, అవసరమైతే పాదయాత్ర చేస్తానని వ్యాఖ్యానించారు. పాదయాత్ర చేస్తే ముఖ్య‌మంత్రి అవుతారా? అని ప్రశ్నించారు. ప్రజల క్షేమం కోరుకున్నవారే ముఖ్య‌మంత్రి అవుతారని చెప్పారు.

  • Loading...

More Telugu News