Vishal Krishna: తమిళనాడులో హైడ్రామా.. విశాల్ నామినేషన్ మళ్లీ తిరస్కరణ!

  • రాత్రి 11 గంటలకు మళ్లీ మారిన సీన్
  • సంతకాలు పెట్టిన వారు స్వయంగా వచ్చి వివరణ
  • విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి

తమిళ రాజకీయాల్లో గంటకో హైడ్రామా నడుస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి తానేంటో నిరూపించుకోవాలన్న నటుడు విశాల్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు విశాల్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ ఎన్నికలో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. సోమవారంతో నామినేషన్ల గడువు ముగియడంతో అధికారులు మంగళవారం వాటిని పరిశీలించారు.  

నామినేషన్ల పరిశీలన సమయంలో విశాల్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయనను ప్రతిపాదిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన పదిమంది ఓటర్లు సంతకాలు చేయగా చివరి నిమిషంలో ఇద్దరు ప్లేటు ఫిరాయించారు. అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన సుమతి, దీపన్‌లు ఆ సంతకాలు  తమవి కావని, ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

రిటర్నింగ్ అధికారి నిర్ణయంతో షాక్ తిన్న విశాల్ తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగినా విశాల్ వెనక్కి తగ్గలేదు. మరోవైపు నామినేషన్ పేపర్లపై సంతకాలు పెట్టిన వారు ఒక్కసారిగా ప్లేటు ఎందుకు ఫిరాయించారో తెలుసుకుందామని సుమతి సమీప బంధువైన వేలు అనే వ్యక్తికి విశాల్ ఫోన్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.

అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, ఆయన అనుయాయుడు రాజేశ్‌ కలిసి తమ ఇంట్లో మహిళల్ని బెదిరించారని, కొంత డబ్బు ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని, అందుకే అలా లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఆడియో టేప్‌ను విశాల్ మీడియాకు విడుదల చేయడంతోపాటు రిటర్నింగ్ అధికారికి కూడా అందించారు. చీఫ్ ఎన్నికల కమిషనర్ ఏకే జ్యోతితోనూ విశాల్ మాట్లాడాడు. దీంతో రాత్రి 8:30 గంటల వేళ విశాల్ నామినేషన్‌ను స్వీకరిస్తున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈసీ నిర్ణయంపై విశాల్ హర్షం వ్యక్తం చేయగా, ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.

ఈసీ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేసిన విశాల్.. చివరికి న్యాయమే గెలిచిందని, తాను ఆర్కే నగర్ నుంచి బరిలోకి దిగుతున్నానని పేర్కొన్నారు. బుధవారం నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. అయితే రాత్రి 11 గంటలప్పుడు సీన్ మరోసారి మారిపోయింది. విశాల్ నామినేషన్‌పై సంతకాలు పెట్టిన సుమతి, దీపన్‌లు స్వయంగా ఈసీ కార్యాలయానికి వచ్చి ఆ సంతకాలు తమవి కావని తేల్చి చెప్పారు. దీంతో ఆడియో టేపులను పరిగణనలోకి తీసుకోలేమని చెప్పిన అధికారులు విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News