Pawan Kalyan: 'డీసీఐ' ఉద్యోగుల ఆందోళనకు పవన్ మద్దతు.. రేపు విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టన!

  • విశాఖ‌ప‌ట్నంలోని డీసీఐ ఉద్యోగి వెంక‌టేష్ ఆత్మ‌హ‌త్య‌
  • డీసీఐ ఉద్యోగుల ఆందోళ‌న ఉద్ధృతం.. రేప‌టి నుంచి స‌మ్మె
  • స‌మ్మెకు మ‌ద్ద‌తు తెలిపి.. వెంక‌టేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌నున్న ప‌వ‌న్‌?

విశాఖ‌ప‌ట్నంలోని కేంద్ర ప్రభుత్వ రంగ 'డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా'(డీసీఐ) ఉద్యోగుల ఆందోళ‌న ఉద్ధృతం అవుతోంది. డీసీఐను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా కార్మిక సంఘాలు కొన్ని నెల‌లుగా నిర‌స‌న తెలుపుతోన్న విష‌యం తెలిసిందే. కేంద్ర‌ ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో డీసీఐ ఉద్యోగి వెంకటేష్ విజయనగరం జిల్లా నెర్లిమర్లలో అత్మహత్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. దీంతో ఈ రోజు ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర స‌ర్కారు తీరుకి నిర‌స‌న‌గా రేపటి నుంచి వారు స‌మ్మెకు దిగ‌నున్నట్లు తెలుస్తోంది.

కాగా, గ‌తంలో డీసీఐ ఉద్యోగులు హైద‌రాబాద్‌కి వ‌చ్చి జ‌న‌సేన‌ అధినేత‌, సినీన‌టుడు పవన్ ను ఆశ్రయించారు. ఈ విష‌యంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఉద్యోగుల పక్షాన నిలబడాలని ఆ రోజు పవన్ క‌ల్యాణ్ విజ్ఞ‌ప్తి చేశారు. వెంక‌టేష్ ఆత్మ‌హ‌త్య‌తో వారి ఆందోళ‌న‌ ఉద్ధృతం అవడం, కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోక‌పోవడంతో రేపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ విశాఖ‌ప‌ట్నానికి వెళ్ల‌నున్న‌ట్లు తెలిసింది. డీసీఐ ఉద్యోగుల ఆందోళ‌న‌కు ఆయ‌న మ‌ద్ద‌తు తెల‌ప‌నున్నారు. అలాగే డీసీఐ ఉద్యోగి వెంక‌టేష్ కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించ‌నున్నారు.

కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ‌ప‌ట్నంతో పాటు విజ‌య‌న‌గ‌రంలోనూ మొత్తం మూడు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. ఈ సంద‌ర్భంగా త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తోనూ స‌మావేశం అవుతారు.

More Telugu News