Kurnool Dist: ప్రేమతో కుమారుడికి బైక్ ఇచ్చి... చేతులకు బేడీలు వేయించుకున్న తండ్రి!

  • కొడుకుకు బండి ఇచ్చిన తండ్రి
  • వేగంగా వెళుతూ యాక్సిడెంట్ చేసిన కుమారుడు
  • బాధితుడు మరణించడంతో తండ్రి పైనా హత్య కేసు

ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు ముచ్చట పడ్డాడు కదా అని టూ వీలర్ అప్పగించి జైలు పాలయ్యాడో తండ్రి. మైనర్లకు వాహనాలు ఇస్తున్న ప్రతి తండ్రికీ ఈ ఘటన ఓ కనువిప్పు వంటిది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా గూడూరు మండలంలో తలారి శ్రీనివాసులు నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు హరికిషోర్ కు ఎటువంటి వాహన లైసెన్సూ లేదు. తండ్రి బైక్ ను తీసుకుని వెళ్లిన హరి, వేగంగా వెళుతూ, శ్యామరాజు అనే వ్యక్తిని ఢీకొనగా, అతను చికిత్స పొందుతూ మరణించాడు.

విచారణలో అతనికి లైసెన్స్ లేదని, బండి కూడా అతనిది కాదని తెలుసుకుని, శ్రీనివాసులును కూడా పిలిపించారు. తండ్రీకొడుకులను అరెస్ట్ చేసినట్టు చూపించి, ఇద్దరిపైనా హత్య కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎవరి బైక్ ను వారే నడపాలని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బండిని రోడ్డుపైకి తీసుకురావాలని, లైసెన్స్ లు లేని కొడుకులకు బండ్లు ఇవ్వరాదని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోకుంటే, ఇలాగే జరుగుతుంది.

More Telugu News