giddi eswar: వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి స్క్రిప్టు వస్తుంది.. ఆ ప్రకారమే మేం మాట్లాడాలి!: గిడ్డి ఈశ్వరి

  • చంద్రబాబుని నేను ఎప్పుడూ దగ్గరగా కూడా చూడలేదు
  • వైఎస్సార్సీపీలో రూల్స్ ఉంటాయి
  • ఏం మాట్లాడాలో కూడా ముందే చెబుతారు...అలాగే మాట్లాడాలి
  • ఎన్ని పనులున్నా టీడీపీ నేతలతో మాట్లాడకూడదు

'బ్యాంకు ఉద్యోగి శెట్టి ఫాల్గుణని రాజకీయాల్లోకి తెచ్చానని మీరు చెబుతున్నారు. మరి ఈ రోజు అదే శెట్టి ఫల్గుణ మిమ్మల్ని విమర్శిస్తున్నాడు కదా?' అని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో టీడీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఆర్కే అడిగారు. దానికి ఆమె సమాధానం చెబుతూ, "అవే విమర్శలు శెట్టి ఫాల్గుణని నా ఎదురుగా చెయ్యమనండి. అలా చెయ్యడు, ఎందుకంటే అలా చేస్తే అక్కడ ఆయనకి మనుగడ ఉండదు. అక్కడ ఆయన పార్టీ సింగిల్ కోఆర్డినేటర్. అలాంటప్పుడు పార్టీని ఫాలో కావాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆఫీసు నుంచి వచ్చే స్క్రిప్టు ప్రకారం మాట్లాడాల్సి ఉంటుంది. నేను కూడా కొన్ని సార్లు స్క్రిప్టు ప్రకారమే మాట్లాడాను" అని చెప్పారు.

 దీంతో ఆర్కే కల్పించుకుని, 'వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు మీరు ఇంచుమించు రోజాలా టీడీపీ నేతలపై నోరేసుకుని పడిపోయేవారు. చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. చంద్రబాబుకి, మీకు పొలం గట్టు తగాదాలు ఉన్నట్టుగా తిట్టేవారు' అన్నారు.

దానికి ఆమె వివరణ ఇస్తూ.. "నిజానికి నేను చంద్రబాబునాయుడును దగ్గరగా కూడా ఏ రోజూ చూడలేదు. రోజాగారంటే టీడీపీలో పని చేశారు కనుక ఆమెకు అనుభవాలు ఉంటాయి కానీ, చంద్రబాబునాయుడు గారిని నేనంత దగ్గరగా చూడలేదు. వైఎస్సార్సీపీలో ఉన్న ఇంకో రూల్ ఏంటంటే.. టీడీపీ వైపు చూడకూడదు. ఏ పని ఉన్నా అక్కడి నేతలు లేదా మంత్రులతో మాట్లాడకూడదు. ఆ పార్టీకి మద్దతిచ్చే ఏ అధికారుల దగ్గరకు వెళ్లకూడదన్న రూల్స్ కూడా ఉన్నాయి.

అందుకని మాకేమీ తెలియదు. నిజానికి సచివాలయం కూడా ఎలా ఉంటుందో తెలియదు. రెండు రోజుల నుంచి సచివాలయానికి వెళ్తుండడంతో అదెలా ఉందో తెలుస్తోంది. ఒకవేళ పొరపాటున అటువెళ్తే...మనం ఏదో తప్పుచేసిన వాళ్లులాగా ఉండాలి. పార్టీలో ఇతరులు కూడా అలాగే చూస్తారు. 'ఏంటమ్మాయ్! ఆ మంత్రి దగ్గరకి వెళ్తున్నావేంటి?' అని అడిగేవారు" అని ఆమె చెప్పారు.

దీంతో మళ్లీ ఆర్కే కల్పించుకుని 'గతంలో రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు తేడా ఏంటంటే.. అటువాళ్లు ఇటువాళ్లని, ఇటువాళ్లు అటువాళ్లని దుమ్మెత్తిపోసుకుంటున్నారు' అన్నారు. దీనికి ఆమె స్పందిస్తూ, "మా కల్పన (ఉప్పులేటి కల్పన) వెళ్లిపోయింది. దీంతో అందరూ నన్ను అడిగేవారు.. ఎందుకెళ్లిపోయింది? అని.. దీంతో నేను ఫోన్ చేస్తే ఆమె కనీసం నా ఫోన్ ఎత్తలేదు. వంతల రాజేశ్వరి కూడా వెళ్లిపోయినప్పుడు అలాగే జరిగింది. వాళ్లిద్దరూ ఎస్టీలు, నాతోనే స్నేహంగా ఉండేవారు. దీంతో అంతా నన్ను అడిగేవారు. అయితే వారెందుకు వెళ్లిపోయారన్న చర్చ మాత్రం పార్టీ నేతల్లో జరిగేది. అయితే తన దాకా వస్తే కానీ విషయం తెలియదన్నట్టు...నా వరకు వస్తే కానీ వారెందుకు పార్టీ విడిచి వెళ్లారు? అన్న విషయం బోధపడలేదు" అని ఆమె చెప్పారు.

 దీంతో ఆర్కే మరోసారి కల్పించుకుంటూ 'వాళ్లు వెళ్లిపోయిన్నప్పుడు చేసిన ఆరోపణలపై పార్టీ ఏనాడైనా ఆత్మ పరిశీలన చేసుకుందా? పోనీ నేతలైనా ఆత్మపరిశీలన చేసుకున్నారా?' అని అడిగారు. దానికి ఆమె సమాధానమిస్తూ, "ఏనాడూ అలా చేయలేదు. ఎందుకు? అలా వెళ్లిపోతున్నారు? అని ఎవరూ ఆలోచించలేదు. అలాగే పార్టీ అధినేత కూడా నా నుంచి ఏం కావాలి? మీకు నేను ఇంకా ఏం చేయగలను? అని ఏనాడైనా పార్టీ నేతలతో తన భావాలు షేర్ చేసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు" అని ఆమె చెప్పారు. 'అలా ఆత్మపరిశీలన చేసుకోలేదు సరికదా.. వాళ్లు తప్పుచేశారు అని ఆలోచించడం వల్ల అలా అలా ఆత్మవంచనకు వెళ్లిపోయామ'ని ఆమె పేర్కొన్నారు.

More Telugu News