giddi eswari: 'సోది చెప్పకు...' అంటూ జగన్ నన్ను తూలనాడారు.. బాగా మధనపడ్డాను!: గిడ్డి ఈశ్వరి

  • జగన్ తిట్టడం వల్లే పార్టీ మారాల్సి వచ్చింది
  • పార్టీ కోసం కష్టపడిన నన్ను పట్టించుకోలేదు
  • సోది చెప్పకు అని కోపంగా విదిలించుకుని వెళ్లిపోయారు

'రాష్ట్రమంతా మీ పేరే వినిపిస్తోంది.. ఎందుకిలా చేశారు?' అన్న ప్రశ్న ఏబీఎన్ ఛానెల్ 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ఎదురైంది. దానికి ఆమె సమాధానమిస్తూ, "ఈ రోజు రాష్ట్రంలో నన్ను అందరూ గుర్తించి మాట్లాడుతున్నారంటే.. గతంలో నేను పడ్డటువంటి కష్టం, వైఎస్సార్సీపీలో పడ్డటువంటి శ్రమ, పార్టీ (వైఎస్సార్సీపీ) తరపున ఇచ్చినటువంటి వాయిస్, ఇవన్నీ చూసి 'గిడ్డి ఈశ్వరి ఎందుకు అలా చేసింది?' అని అంటున్నారు...

మేము మాటకి కట్టుబడి ఉండే మనుషులం. నేను టీచర్ ని, మా నాన్న అప్పలనాయుడు ఎక్స్ ఎమ్మెల్యే. మేము ఎవరికైనా సహాయం చేసే మనుషులం. ముఖ్యంగా కష్టజీవులం. అయితే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అనంటే... వైఎస్ జగన్ మాటతప్పడం వల్ల. ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నన్ను దూషించడం వల్ల. ఇడుపులపాయలో ఆయన నన్ను దూషించారు. దానికి కారణాల్లోకి వెళ్తే.. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోవడంతో అరకు బాధ్యతలు కూడా నాకు అప్పగించారు.

అరకు అసెంబ్లీ నియోజకవర్గం, అరకు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ ఛార్జీగా నన్ను నియమించారు. ఆ సందర్భంగా ఆయనే స్వయంగా 'అమ్మా! మీరొక వాల్మీకి క్యాండిడేట్ ను సెలెక్ట్ చేసి పార్టీని బలోపేతం చేయ్యండి' అన్నారు. ఎందుకంటే '11 మండలాల్లో మీకు మంచి పట్టుంది కదా' అని ఆయనే చెప్పారు. దీంతో నేను వాల్మీకి అనే తెగ నుంచే శెట్టి ఫాల్గుణ అనే ఒక బ్యాంకు ఎంప్లాయీని తీసుకెళ్లి జగన్ కు పరిచయం చేశాను.

అతనిని ఉద్యోగం మానెయ్యాలని చెబితే... ఏడేళ్ల సర్వీస్ ఉండగానే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలంటే లక్షలు ఖర్చు పెడితే కానీ పూర్తికావు. ఈ క్రమంలో అక్టోబర్ 12న ఆయనను సింగిల్ కో ఆర్డినేటర్ ను చేసి, 'మీరే ఎమ్మెల్యే' అని చెప్పడం జరిగింది. మీరే చక్కగా చేసుకోండి అని శెట్టి ఫాల్గుణకి జగన్ చెప్పడం జరిగింది.

 ఇది జరిగిన తరువాత అక్టోబర్ 28న పార్టీ క్యాడర్ నాకు ఫోన్లు చేశారు. 'అమ్మా! టీడీపీకి చెందిన కుంభా రవిబాబు రమ్మంటున్నారు. జగన్ వద్దకు వెళ్లి పార్టీ కండువా వేసుకుంటారంట. ఆయన మనల్ని రమ్మంటున్నారు' అని ఫోన్ లో చెప్పారు. ఇక్కడ కుంభా రవిబాబు గురించి చెప్పాలి. కుంభా రవిబాబు నాన్ లోకల్ ట్రైబల్ ...ఆయన గత ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో పని చేశారు. ఆ సమయంలో పార్టీ టికెట్ సర్వేశ్వరరావుకా? లేక కుంభా రవిబాబుకా? అన్న పోటీ కూడా నడిచింది. అయితే సర్వేశ్వరరావును పార్టీ టికెట్ వరించడంతో, కుంభా రవిబాబు జగన్ ను తిట్టి టీడీపీలోకి వెళ్లడం జరిగింది.

అప్పుడు టీడీపీ ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ తరువాత మళ్లీ టీడీపీ ఆ టికెట్ ను వాపస్ తీసుకుంటే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అసలు ఆయన 2004లో విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం ఎమ్మెల్యే. అప్పట్లో అనంతగిరి, అరకు మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండేవి. దానిని బేస్ చేసుకుని ఆయన అరకులో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు అరకులో వైఎస్సార్సీపీ బలంగా ఉంది, అక్కడికి వెళ్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అందులోకి వెళ్తే టికెట్ వస్తుంది అని, మళ్లీ పాటపాడుతూ, పార్టీలో చేరాడు. ఆయన పార్టీలోకి వచ్చే ముందు నియోజకవర్గ ఇన్ ఛార్జీగా ఉన్నాను, లోకల్ ఎమ్మెల్యేని, పార్టీ కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యేని అయిన తనను ఆయన సంప్రదించాలి. ఆయన అలా చేయలేదు.

పోనీ జగన్ గారైనా 'అమ్మా! కుంభా రవిబాబుని కండిషనల్ గానో లేక అన్ కండిషనల్ గానో తీసుకుంటున్నాము' అని చెప్పాలి, అలా కూడా జరగలేదు. జగన్ గారి మీద ఆ బాధ్యత ఉంది, దానిని ఆయన విస్మరించారు. ఇంతలో నవంబర్ 2న కుంభా రవిబాబు పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని పార్టీ క్యాడర్ నాకు చెప్పారు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే నేను హైదరాబాదు కాల్ చేశాను. అప్పటికి జగన్ గారు లండన్ వెళ్లారు.

వెంటనే కేఎన్ఆర్ (జగన్ పీఏ) గారికి చెబితే జగన్ 2వ తేదీన వస్తారండి అన్నారు. దీంతో ఆ వెంటనే పార్టీలో జగన్ గారి తరువాత విజయ్ సాయిరెడ్డి (విశాఖపట్టణం ఇన్ ఛార్జీ) కాబట్టి ఆయనకు ఫోన్ చేశాను. ఆయన 'కుంభా రవిబాబును పార్టీలో జాయిన్ చేసుకుంటే మీకేం కష్టమమ్మా, మీకేం నష్టం?' అని అడిగారు. 'అది కాదు సర్, ఆయన నాన్ లోకల్ ట్రైబల్. పైగా ఆయన స్థానికేతరుడు, మాకు అవకాశాలు లేవు. ఆయన ఇక్కడికి వచ్చి డబ్బున్న మనిషిలాగా చలామణి అయితే ప్రజలు కానీ క్యాడర్ కానీ అంగీకరించరు. ఇదే నేను జగన్ గారికి చెప్పాలనుకుంటున్నాను' అని చెబితే...'లేదు లేదు జగన్ గారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు' అని చెప్పి ఫోన్ పెట్టేశారు.

 దీంతో దీని గురించిన సమాచారం సజ్జల రామకృష్ణారెడ్డి తదితర పెద్దలకు చెబుతూనే, కుంభా రవిబాబు గ్రూపు రాజకీయాలు చేస్తారు. ఆయనను గిరిజనులు తట్టుకోలేరు అని చెబుతూనే ఉన్నాను. ఇంతలో జగన్ గారు లండన్ నుంచి వచ్చారు. దీంతో హైదరాబాదులో ఆయనను కలుద్దామని పార్టీ క్యాడర్ తో బయల్దేరి వైజాగ్ వరకు వస్తే...'ఇప్పుడు ఆయన అపాయింట్ మెంట్ కుదరదు, నేరుగా ఇడుపులపాయ రండి అని చెప్పారు'.

 దీంతో ఇడుపులపాయలో బలవంతంగా ఆయన టెంట్ దగ్గరకి వెళ్లి..'అన్నా మాకు అన్యాయం చెయ్యకండి. మిమ్మల్నే నమ్ముకున్నాము' అని అన్నాను...దానికి ఆయన 'ఏం? ఏం జరిగింది?' అని అడిగారు. 'కుంభా రవిబాబు, పసుపులేటి బాలరాజు వంటి లీడర్స్ ని పార్టీలోకి తీసుకోకండి. వాళ్లు నాన్ లోకల్ ట్రైబ్స్' అని చెప్పాను. దీంతో 'దానితో నీకేం సంబంధం. నీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నావు?' అని ఆయన అడిగారు. అంతే కాకుండా 'కుంభా రవిబాబు అరకు ఎమ్మెల్యే అభ్యర్థి ... ఇతర విషయాలు నీకెందుకు?' అని జగన్ అన్నారు. దీంతో అన్నా ఇది మీకు భావ్యం కాదు అని బతిమాలితే.. 'ఇలాంటి సోది మాట్లాడవద్దు..ఇలాంటి పంచాయతీ నాకు వద్దు' అని నన్ను విదిలించుకుని వెళ్లిపోయారు.

 దీంతో నేను షాక్ తిన్నాను. నెల రోజుల క్రితం ఫల్గుణకు నువ్వే ఎమ్మెల్యేవి అని చెప్పిన జగన్ మాటమార్చడంతో ఆశ్చర్యపోయాను. ఆ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ అయిన నాకు సంబంధం లేదంటే ఎలా? అని మధనపడ్డాను. మరెవరైనా అయితే జగన్ పాదయాత్రలో ఉన్నాడు అని పట్టించుకోకుండా ఆ రోజే, అదే టెంట్ బయటే ప్రెస్ మీట్ పెట్టి అక్కడే పార్టీ మారుతున్నట్టు ప్రకటించి ఉండేవారు. నేను మాత్రం తీవ్రంగా మధనపడిపోయాను. సర్వేశ్వరరావు పార్టీ వీడిన తరువాత క్యాడర్ చెదిరిపోకుండా కష్టపడింది నేను. ఇంత కష్టానికి లభించిన గుర్తింపు ఇదా? అని అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తరువాత పార్టీ మారాను" అంటూ తాను పార్టీ మారడం వెనుక వున్న కథంతా వివరించారు.

  • Loading...

More Telugu News