shiva prasad: అవార్డుల జ్యూరీలో కేవలం సినిమావాళ్లు మాత్రమే ఉండకూడదు: ఎంపీ శివప్రసాద్

  • గతంలో మా సినిమాలకు కూడా అవార్డులు రాలేదు
  • అప్పుడు మేము ప్రెస్ మీట్లు పెట్టి గోల చెయ్యలేదు
  • అవార్డుల్లో ఎవరో ఒకరు, ఏదో ఒక రకంగా ఇన్ ఫ్లుయెన్స్ చేసుకుంటారు

నంది అవార్డుల జ్యూరీలో ఇన్ ఫ్లుయెన్స్ సర్వసాధారణమని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ తెలిపారు. నంది అవార్డులపై రేగిన వివాదంపై 10 టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఒకసారి జ్యూరీ అవార్డులు ఇచ్చేసిన తరువాత దాని గురించి మాట్లాడకూడదు. మేమంతా కూడా సినిమాలు తీశాం, మేమంతా పోటీకి పంపించాం. రావాల్సిన సినిమాకు కూడా అవార్డు రాలేదు. అలాంటప్పుడు మేమేమీ ప్రెస్ మీట్లు పెట్టి గోల చెయ్యలేదు.

మీరే చెప్పండి! పది మంది సభ్యులున్న జ్యూరీలో అందరూ ఒకేలా ఆలోచిస్తారా? ఒక్కొక్కరు ఒక్కో రకంగా వుంటారు. జ్యూరీలో ఎవర్ని పెట్టినా వారికి ఎవరో ఒక మంత్రి తెలిసే ఉంటాడు. జ్యూరీదాక వచ్చిన మెంబర్స్ ఎవరో ఒకరికి పరిచయం ఉంటారు. పరిచయంతోనే కదా జ్యూరీ ఇచ్చేది? నేనేమంటున్నాననంటే.. ఒక్కటి మాత్రం చెయ్యాలి.. పక్కా సినిమా వాళ్లను మాత్రమే పెట్టకూడదు. కొంత మంది లేడీస్ ని, వివిధ రంగాలలో ఉన్నవారిని జ్యూరీలోకి తీసుకోవాలి. ప్రతి అవార్డుల్లోనూ ఎవరో ఒకరు, ఏదో ఒకటి ఇన్ ఫ్లుయెన్స్ చేసుకుంటారు. అది వాస్తవం.

ఈ అవార్డుల గురించి ఒక్క మాట చెప్పాలి. డబ్బింగ్ చెప్పినోళ్లకి అవార్డు ఇచ్చి, డబ్బింగ్ యాక్టర్ కి అవార్డు ఇచ్చి, రీమేక్ ను పక్కన పెట్టడం కరెక్టు కాదు" అని ఆయన స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అధినేత ఎలా పోటీ చెయ్యమంటే అలా చేస్తానని ఆయన చెప్పారు. అయితే రెండు సార్లు తాను ఎంపీగా గెలిచానని, ఈ సారి గెలిస్తే హ్యాట్రిక్ ఎంపీగా ఉంటానని ఆయన మనసులో మాట బయటపెట్టారు. 

More Telugu News