shiva prasad: నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది చంద్రబాబే.. రాజశేఖర్ రెడ్డి పిలిచినా వెళ్లలేదు!: శివప్రసాద్

  • కరుణాకర్ రెడ్డి ద్వారా వైఎస్ తండ్రి రాజారెడ్డి పరిచయం  
  • 1996లో రాజశేఖర రెడ్డి ఎంపీ సీటు ఇవ్వాలని ప్రయత్నించారు
  • పీజేఆర్ అడ్డుపడడంతో సీటు రాలేదు 
  • చంద్రబాబు ఎమ్మెల్యే, మంత్రిని చేశారు

'అసలు మిమ్మల్ని రాజకీయాల్లోకి ఎవరు తెచ్చారు?' అన్న ప్రశ్నను టీడీపీ ఎంపీ శివప్రసాద్ ను 10 టీవీ ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. దానికాయన వెంటనే స్పందిస్తూ 'ఇంకెవరూ.. మా బాసే.. చంద్రబాబుగారే' అన్నారు. తర్వాత వివరంగా చెబుతూ, "అసలు ఏం జరిగిందంటే, వైఎస్ తండ్రి రాజారెడ్డి గారి సన్నిహిత నాయకుడు కరుణాకర్ రెడ్డి నాకు బాగా పరిచయం. ఆయన ద్వారా రాజారెడ్డిగారు పరిచయం అయ్యారు. రాజారెడ్డి తిరుపతి వస్తే నన్ను వదిలేవారు కాదు. అలాగే రాజశేఖర్ రెడ్డికి కూడా నేనంటే భలే ఇష్టం.

ఇదిలా ఉంచితే, 1991లో తిరుపతి పార్లమెంటుకి సీటివ్వడానికి చంద్రబాబు గారు తిరుపతికి వచ్చి నన్ను పిలిచారు. నేను ఆయనకు కనపడకుండా దాక్కున్నాను, అప్పుడు 'ప్రేమతపస్సు' సినిమా డైరెక్ట్ చేస్తున్నా. ఇక తప్పక చంద్రబాబుగారి దగ్గరకు వెళ్లా. 'నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు, నన్ను వదిలేయండి, నాకు డ్రామాలు, సినిమాలు ముఖ్యం.. అవే చూసుకుంటాను' అని చెబితే, 'సరేలే' అని చెప్పి వెళ్లిపోయారు.

చంద్రబాబుగారిది, మాది పక్కపక్క ఊళ్లు, కలిసి చదువుకున్నాం... చాలా క్లోజ్ గా వుండేవాళ్ళం. నేను స్కూల్ పీపుల్స్ లీడర్ ని. ఒకసారి 'పరువు కోసం' అనే నాటకం వేశాం. అందులో చంద్రబాబు గారు హీరో.. నేను కమెడియన్.. నెల్లాళ్లు రిహార్సల్స్ చేసి ఆ నాటకం వేశాం. ఇక హైస్కూల్ లో చదివేంతవరకూ చంద్రబాబు చాలా కామ్ గానే వుండేవారు.  

మళ్లీ రాజకీయాలకి వస్తే... చంద్రబాబుగారి స్టయిల్ ఎలా ఉంటుందంటే, 'వస్తావా... రా..' అంటారు. రాజశేఖర్ రెడ్డి శైలి అలా వుండదు. 'నువ్వు మా కేండిడేట్, ఇక్కడ సంతకం పెట్టు.. అన్నట్టుగా వుంటుంది .. అదంతా ప్రేమతోనే వుంటుంది.. 96లో మళ్లీ రాజశేఖర్ రెడ్డిగారి నుంచి పిలుపు... తిరుపతి పార్లమెంటు సీటు కోసం. కరుణాకర్ రెడ్డిని, నన్ను ఢిల్లీకి పిలిచి అందరికీ పరిచయం కూడా చేశారు. అయితే, జనార్దన్ రెడ్డిగారు వుండేవారు కదా, ఆయన 'ఇతను నన్నడగలేదు.. ఈయన రాజశేఖర్ రెడ్డి మనిషి అయిపోతాడు' అనుకుని చివర్లో నా పేరు తీసేశారు. అలా సీటు రాలేదు.  

ఈ విషయం మా సార్ చంద్రబాబు గారికి తెలిసింది. 'ఏమయ్యా, నువ్వు నా క్లాసు మేట్ .. నేను పిలిస్తే రాలేదు. వాళ్లు పిలిస్తే వెళతావా ..?' అంటూ బాబు అడిగారు. అంతేకాదు, నా దగ్గరికి ముగ్గురు ఎమ్మెల్యేలను పంపించారు. ఇక ఈసారి ఒప్పుకున్నాను. అలా 99 ఎన్నికలకు సీటిచ్చారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డికి విషయం చెప్పాను. 'నేను ఇవ్వలేకపోయాను, నీ మిత్రుడు కదా, వెళ్లు' అన్నారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక, ఓ టీవీ ప్రారంభోత్సవంలో కలిస్తే, 'ఏమయ్యా కనపడలేద'ని అన్నారు, 'ఏమయ్యా నువ్వు నా దగ్గరికి రావా? వస్తావా రావా?' అన్నారు. అయినా నేను పోలేదు. ఒక చోట వున్నాం, మర్యాదగా వుండాలి. ఆదర్శంగా వుండాలి.. అందుకని పోలేదు. నేను పోయుంటే ఆయన ఏదైనా చేసేవాడు.." అంటూ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు శివప్రసాద్.  

More Telugu News