Hyderabad: కొన‌సాగుతోన్న 'కొలువుల‌కై కొట్లాట'.. భారీగా చేరుకున్న యువ‌త‌

  • హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్‌లో సభ 
  • భారీగా త‌ర‌లివ‌చ్చిన యువ‌త‌
  • స‌ర్కారు ఉద్యోగాల నియామ‌కాలు చేప‌ట్ట‌డం లేద‌ని నినాదాలు
  • నిర్బంధాల‌తో నిర‌స‌న‌ల‌ను ఆడ్డుకోలేరు-కోదండ‌రామ్‌

టీజేఏసీ చేప‌ట్టిన 'కొలువుల‌కై కొట్లాట' స‌భకు తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్య‌లో యువ‌త హాజ‌రైంది. స‌భ‌లో టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం, విద్యావేత్త చుక్కా రామయ్య, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, టీడీపీ నేత ఎల్‌.రమణ, చాడ వెంక‌ట్ రెడ్డి, ప్ర‌జా గాయ‌కురాలు విమ‌ల‌క్క పాల్గొన్నారు. స‌భ జ‌రుగుతోన్న స‌రూర్‌న‌గ‌ర్ ఇండోర్‌ స్టేడియం వ‌ద్ద పోలీసు బందోబ‌స్తును భారీగా ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వ‌హించిన త‌రువాతే సభా ప్రాంగణంలోకి అనుమతి ఇస్తున్నారు.

తెలంగాణ వ‌చ్చి మూడున్న‌రేళ్లు అయిపోయిన‌ప్ప‌టికీ ఉద్యోగ నియామ‌కాలు లేవంటూ నిరుద్యోగులు రాష్ట్ర స‌ర్కారుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రామ్ మాట్లాడుతూ... ఓయూలో పోలీసుల లాఠీఛార్జీల‌ను ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. నిర్బంధాల‌తో నిర‌స‌న‌ల‌ను ఆడ్డుకోలేరని అన్నారు. సభకు వస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల అక్రమ అరెస్ట్‌లను టీజేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు.   

More Telugu News