shiva prasad: చంద్రబాబు నాకు సొంత అన్నలాంటి వాడు: ఎంపీ శివప్రసాద్

  • మేమిద్దరం 6 నుంచి 11 వరకు కలిసి చదువుకున్నాం
  • చంద్రబాబు నాకు బెస్టు ఫ్రెండ్
  • మా మధ్య గ్యాప్ పెరిగిందన్నది అవాస్తవం

 చంద్రబాబునాయుడు తనకు సొంత అన్నలాంటివాడని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెలిపారు. 10 టీవీ ఫేస్ టు ఫేస్ లో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, తాను ఆరోతరగతి నుంచి 11వ తరగతి వరకు కలిసి చదువుకున్నామని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఆయనను సొంత అన్నలా భావిస్తానని ఆయన చెప్పారు.

 తమ మధ్య గ్యాప్ అన్న ప్రశ్నే లేదని ఆయన తెలిపారు. తాను అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వకపోవడం అన్నది ఇంతవరకు జరగలేదని, అయితే ఒకసారి మూడు గంటలు ఆలస్యమైందని ఆయన చెప్పారు. తాను ఫోన్ చేశానని చెబితే అటునుంచి అరగంటలోపు ఫోన్ వస్తుందని ఆయన తెలిపారు. అలాంటి తమ మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. తమ మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వచ్చిన తరువాత గత మార్చి 1న ఆయన పిలిపించారని అన్నారు.

 సాయంత్రం 7:40 గంటలకు తామిద్దరం సమావేశమయ్యామని, గంటా 40 నిమిషాల పాటు వివిధ విషయాలపై మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పదవి తనకు ఇచ్చి ఉంటే బాగుండేదన్న ఆలోచన ఉండేదని ఆయన తెలిపారు. పార్టీలో తనకు స్థానం కల్పించిన తరువాత ఎస్సీల్లో తనకు మాత్రమే ప్రతి ఎన్నికల్లో ఆయన సీటు ఇస్తూ వచ్చారని శివప్రసాద్ చెప్పారు.

 పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తరువాత బోలెడు సమీకరణాలు ఉంటాయని, ఆయనపై చాలా బాధ్యతలు ఉంటాయని అన్నారు. వాటికి అనుగుణంగా ఆయన పని చేస్తుంటారని చెప్పారు. అంతే కాకుండా అశోక్ గజపతిరాజు పెద్దాయన అని, పార్టీలో చంద్రబాబును మొదటి నుంచీ వెన్నంటి ఉన్నారని ఆయన తెలిపారు. అలాంటి వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం సబబేనని ఆయన సమర్థించారు. ఇప్పుడు కేంద్రం వద్దకు చంద్రబాబు చెప్పిన ఏ మాట వెళ్లాలన్నా..దానిని అశోక్ గజపతిరాజే చేరుస్తారని శివప్రసాద్ తెలిపారు. 

More Telugu News