కొందరిని విడిచి వెళ్తూ, గుడ్‌ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది!: 'అజ్ఞాతవాసి' యూనిట్ పై ఖుష్బూ ట్వీట్‌

04-12-2017 Mon 15:02
  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో ఖుష్బూ కీలక పాత్ర
  • తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింద‌న్న ఖుష్బూ
  • త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి కృత‌జ్ఞ‌త‌లు
  • త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం ప‌ట్ల హ‌ర్షం
పవన్ కల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో సీనియర్‌ నటి ఖుష్బూ కీలక పాత్రలో క‌న‌ప‌డ‌నున్నారు. తాజాగా ఆమె భావోద్వేగ‌భ‌రితంగా ఓ ట్వీట్ చేశారు. కొందరిని విడిచి వెళ్తూ గుడ్‌ బై చెప్పాలంటే బాధగా ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి వారే ‘అజ్ఞాతవాసి’ సినిమా బృందం అని అన్నారు. త‌న‌ చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఇంతటి మంచి వ్యక్తులకు గుడ్ బై చెప్పి వెళుతోంటే త‌న కళ్లు చెమర్చాయని అన్నారు.

ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడం ప‌ట్ల ఆమె హ‌ర్షం వ్య‌క్తం చేశారు. న‌టుల నుంచి ఆయ‌న‌ ఉత్తమ ప్రదర్శన రాబట్టుకునే విధానం త‌న‌ను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. అదే సమయంలో సహనటుడు పవన్‌కల్యాణ్ కు కూడా థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు తెలిపారు. 'డీవోపీ మణికందన్‌ ప్రియమైన వ్యక్తి' అని పేర్కొన్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాల‌ని ఆకాంక్షించారు.