musharaf: ముషారఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించండి: ఐక్యరాజ్యసమితికి బలూచ్ మహిళా నేత డిమాండ్

  • హఫీజ్ సయీద్ కి బిగ్ ఫ్యాన్ నని ముషారఫ్ ప్రకటన
  • బలూచిస్థాన్ ప్రజలను ఊచకోత కోయించాడు  
  • ముషారఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ డిమాండ్ 

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ కు బలూచిస్థాన్ మహిళా ఉద్యమనేత ప్రొఫెసర్ నయోలా ఖాద్రీ బలూచ్ షాక్ ఇచ్చారు. ముషారఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. కశ్మీర్‌ లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న లష్కరే తొయిబా, జమాతుద్ దవా ఉగ్రమూకల అధినేత హఫీజ్‌ సయీద్‌ కి తాను బిగ్ ఫ్యాన్ నంటూ ముషారఫ్ బాహాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో ఆ వ్యాఖ్యలను ఖండించిన ఆమె.. ముషారఫ్ ను స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్టు (ఎస్డీజీటీ) జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న హఫీజ్‌ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ముషారఫ్‌ ను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 కింద ఎస్డీజీటీ జాబితాలో చేర్చాలని ఆమె సూచించారు. సాక్షాత్తూ ముషారఫే కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోసినట్టు అంగీకరించారని తెలిపిన ఆమె, అమెరికా రంగంలోకి దిగాలని డిమాండ్ చేశారు.

ముషారఫ్ పాలనలోనూ, ఆ తరువాత లష్కరేతో ఆయన ఎలాంటి సంబంధాలు కొనసాగించారో తేల్చాలని ఆమె సూచించారు. ఉగ్రవాద సంస్థల్లోకి చేరికలు ప్రోత్సహించడం, ఇంటెలిజన్స్ సమాచారం రాబట్టడం, కోవర్టు ఆపరేషన్లు సాగించడం, ఆయుధాలు, నిధులు సమకూర్చడం వంటి అంశాల్లో ఆయన నుంచి పూర్తి సమాచారం సేకరించాలని అమెరికాను ఆమె డిమాండ్ చేశారు.

 అమెరికా నుంచి తీసుకున్న ఆయుధాలతో బలూచ్ ప్రజలను ముషారఫ్ ఊచకోత కోయించారని, ఇప్పటికీ బలూచిస్థాన్ ప్రజల రక్తం కోసం కుక్కలాగా ఎదురుచూస్తున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషారఫ్ ను అంతర్జాతీయ ఎస్డీజీటీ ఉగ్రవాదిగా నిరూపించేందుకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించే పనిని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం వెంటనే మొదలు పెట్టాలని ఆమె కోరారు. కాగా, లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఇప్పటికే గుర్తించిన అమెరికా, అతని తలకు 10 మిలియన్ డాలర్ల నజరానా కూడా ప్రకటించింది. 

  • Loading...

More Telugu News