digital india: ఆయుర్వేదం, యోగా ప్ర‌పంచానికి భార‌త్ అందించిన ఆవిష్క‌ర‌ణ‌లు!: హెచ్ఐసీసీలో ప్ర‌ధాని మోదీ

  • స్టార్ట‌ప్ ఇండియా ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డే వ్య‌వ‌స్థ‌
  • వ్య‌వ‌సాయ రంగంలో 50 శాతం భాగ‌స్వామ్యం మ‌హిళ‌ల‌దే
  • క‌ల్ప‌నా చావ్లా, సునీత విలియ‌మ్స్ మ‌హిళా మేధోశ‌క్తికి నిద‌ర్శ‌నం

మ‌హిళ‌ల‌కే తొలి ప్రాధాన్యం అన్న‌ది భార‌త చ‌రిత్రలోనే ఉంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. హైద‌రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జ‌రుగుతోన్న జీఈఎస్‌లో మోదీ మాట్లాడుతూ... ప్రపంచ అతిపెద్ద డిజిట‌ల్ డేటాబేస్ అయిన ఆధార్ కార్డును తీసుకొచ్చామ‌ని తెలిపారు. స్టార్ట‌ప్ ఇండియా ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే వ్య‌వ‌స్థ అని చెప్పారు. వ్య‌వ‌సాయ రంగంలో 50 శాతం భాగ‌స్వామ్యం మ‌హిళ‌ల‌దేన‌ని చెప్పారు. డిజిట‌ల్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియ‌ల్ టెక్నాల‌జీ, మీడియా, ఎంట‌ర్‌టైన్ మెంట్ రంగాల్లో కొత్త వ్యాపార‌ అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని అన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రం సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, సానియా మిర్జాలాంటి వారికి నిల‌యమ‌ని న‌రేంద్ర మోదీ కొనియాడారు. భార‌త్‌లో జ‌న్మించిన‌ ఝాన్సీ ల‌క్ష్మీభాయి లాంటి వారు స్త్రీ శ‌క్తికి ప్ర‌తీక‌లని, క‌ల్ప‌నా చావ్లా, సునీత విలియ‌మ్స్ మ‌హిళా మేధోశ‌క్తికి నిద‌ర్శ‌నమ‌ని చెప్పారు. 'హైద‌రాబాద్ టెక్నాల‌జీకే కాదు భార‌త్‌, అమెరికాల మ‌ధ్య బంధం బ‌లోపేతం కావ‌డానికి ఓ ప్రతీక' అని చెప్పారు. భార‌త పురాణాల్లో కూడా శ‌క్తిగా దేవ‌త‌ను పూజిస్తామ‌ని అన్నారు.

ద‌శాంశ‌మాన‌ము, సున్నా విలువ‌ను క‌నుగొన‌డం భార‌త మేధో శ‌క్తికి నిద‌ర్శనమ‌ని న‌రేంద్ర మోదీ తెలిపారు. ఆయుర్వేదం, యోగా ప్ర‌పంచానికి భార‌త్ అందించిన ఆవిష్క‌ర‌ణ‌లని చెప్పారు. వ్యాపార రంగంలో అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందులో ఓ భాగ‌మేన‌ని తెలిపారు. అభివృద్ధికి అనేక అడ్డంకుల‌ను సృష్టించేలా ఉన్న‌ పాత చ‌ట్టాల‌ను తొల‌గించేశామ‌ని చెప్పారు.    

More Telugu News