nara brahmani: హెచ్ఐసీసీలో మెరిసిన నారా బ్రాహ్మణి.. సెల్ఫీలు తీసుకున్న మహిళా పారిశ్రామికవేత్తలు!

  • జీఈఎస్ లో పాల్గొనేందుకు వచ్చిన నారా బ్రాహ్మణి
  • మహిళలకు అపూర్వ అవకాశాలు దగ్గర కానున్నాయని వ్యాఖ్య
  • హైదరాబాద్ లో సదస్సు జరగడంతో ఎంతో ఆనందమన్న బ్రాహ్మణి

యువ మహిళా పారిశ్రామికవేత్త, సీఎం చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, హైదరాబాద్ లో ప్రారంభం కానున్న జీఈఎస్ లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సు పారిశ్రామిక రంగానికి మరింత ఉపయుక్తకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సు వేదికగా యువత తమలోని ఆలోచనలను పంచుకోవచ్చని అన్నారు. ఇక్కడ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అపూర్వ అవకాశాలు దగ్గర కానున్నాయని, ఎన్నో ప్యానల్ డిస్కషన్స్ లో వారు పాల్గొన వచ్చని అన్నారు. ఈ చర్చల తరువాత వారు కూడా మరింత ఉన్నత స్థితికి ఎదగవచ్చని అన్నారు.

తెలుగు నగరం హైదరాబాద్ ఈ సదస్సుకు వేదిక కావడం తనకు ఆనందాన్ని కలిగించిందని, ఇదే సమయంలో సదస్సు ఎక్కడ జరుగుతుందన్న సంగతి ముఖ్యం కాదని చెప్పారు. గత సంవత్సరం అమరావతిలో అతిపెద్ద మహిళా సదస్సును విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. మహిళల్లో వ్యాపారవేత్తలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని బ్రాహ్మణి అభిప్రాయపడ్డారు.

తాను వెంచర్ కాపిటలిస్టుగా ఉన్నానని, ఎన్నో కంపెనీలకు నిధులందిస్తున్నానని ఆమె అన్నారు. వ్యాపారాన్ని పక్కన బెట్టి, కుటుంబాన్నే చూసుకుంటే, మహిళదే ప్రధానపాత్రని, అదే స్థానాన్ని బిజినెస్ లోనూ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తే, వారు ఎంతో సాధిస్తారని అన్నారు. హెచ్ఐసీసీ వద్ద బ్రాహ్మణిని చూసిన వివిధ రాష్ట్రాల మహిళా పారిశ్రామికవేత్తలు, ఆమెతో మాట్లాడుతూ, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.

More Telugu News