Ajit doval: పాక్‌తో ఎన్ఎస్ఏ అజిత్ దోవ‌ల్ ర‌హ‌స్య మంత‌నాలు.. బ‌య‌ట‌పెట్టిన జాతీయ మీడియా!

  • పాక్ ఎన్ఎస్ఏతో ర‌హ‌స్యంగా టెలిఫోన్ సంభాష‌ణ‌
  • దాయాది బుకాయింపుల‌పై నిల‌దీసిన దోవ‌ల్‌
  • జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదుల‌పైనా చర్చ‌

గ‌తేడాది జ‌న‌వ‌రిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావ‌రంపై పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు దాడి చేసిన అనంత‌రం భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవ‌ల్.. పాక్ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు లెప్టినెంట్ జ‌న‌ర‌ల్ నాజ‌ర్ ఖాన్ జాన్జువాకి ఫోన్ చేసి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని జాతీయ మీడియా సంస్థ ఒక‌టి బ‌య‌పెట్టింది. పాకిస్థాన్‌తో ర‌హ‌స్య మంత‌నాలు జ‌రిపినట్టు వివ‌రించింది.

ప‌ఠాన్‌కోట్ దాడిలో కీల‌క నిందితులైన కాషిఫ్ జాన్‌, షాహిద్ ల‌తీఫ్‌తోపాటు మ‌రో న‌లుగురి జాడ తెలియ‌ద‌ని పాక్ బుకాయించ‌డంతో దోవల్ నిల‌దీశార‌ని, ఆధారాల‌ను వారిముందు ఉంచి ఇప్పుడు చెప్పాల‌నడంతో పాక్ బిక్క‌చ‌చ్చిపోయింద‌ని పేర్కొంది. పాక్‌ను అడ్డాగా చేసుకుని భార‌త్‌పై విరుచుకుప‌డుతున్న జైషే మ‌హమ్మ‌ద్ ఉగ్ర‌వాదుల‌పైనా దోవ‌ల్ తీవ్రంగా స్పందించిన‌ట్టు తెలిపింది. ప‌ఠాన్‌కోట్ దాడి త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ప్ప‌టికీ ఇరు దేశాల ఎన్ఎస్ఏలు ర‌హ‌స్య మంత‌నాలు జ‌ర‌ప‌డం విశేష‌మ‌ని పేర్కొంది.    

పాక్‌ను దోవ‌ల్ హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ ఉగ్ర‌వాదుల‌ను అరెస్ట్ చేసేందుకు పాక్ వెన‌క‌డుగు వేసింది. పాక్ ఐఎస్ఐ డైరెక్ట‌రేట్ నుంచి వ‌చ్చిన ఒత్తిళ్లే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇక దోవ‌ల్ మంత‌నాల వెన‌క మ‌రో ల‌క్ష్యం కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుత ప్ర‌ధాని షాహిద్ అబ్బాసీ పాల‌న‌లో పాక్ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకోవ‌డం మ‌రో కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.  

More Telugu News