సెల్‌టవర్ ఎక్కిన ఫాతిమా కాలేజీ విద్యార్థులు.. త‌న వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని చెప్పిన చంద్ర‌బాబు

26-11-2017 Sun 13:57
  • త‌మ భ‌విష్య‌త్ నాశ‌నం అయింద‌ని ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళ‌న‌
  • సెల్‌టవర్‌ ఎక్కిన వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు
  • ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్
  • రేపు ఉద‌యం త‌న‌ను క‌ల‌వాల‌ని క‌బురు

క‌డ‌ప‌లోని ఫాతిమా మెడికల్ కాలేజీకి ఎంసీఐ గుర్తింపును రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రోడ్డున ప‌డ్డ‌ వంద మంది వైద్య విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. తాము ఎన్ని ధ‌ర్నాలు చేసినా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న రావ‌డం లేదంటూ విజయవాడ గుణదలలోని ఈఎస్‌ఐ ఆసుప‌త్రి సమీపంలో గల సెల్‌టవర్‌ ఎక్కారు. సెల్‌టవర్‌ ఎక్కిన వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని అంటున్నారు. తమకు న్యాయం చేస్తామ‌నే హామీ ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరిస్తున్నారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు వారిని కింద‌కు దిగ‌మ‌ని కోరుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ వద్ద తనను కలవాలని తెలిపారు. కాగా, ఫాతిమా కాలేజీ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై ఈనెల 28న ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.