YSRCP: విజయసాయిరెడ్డి కారణంగానే తెలుగుదేశంలోకి వెళుతున్నా!: గిడ్డి ఈశ్వరి

  • రేపు చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా
  • విజయసాయిరెడ్డి కారణంగానే పార్టీ మార్పు
  • కార్యకర్తలను అడిగానన్న గిడ్డి ఈశ్వరి

ప్రజా సంకల్ప యాత్ర పేరిట ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి దగ్గరై, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. పార్టీ తరఫున పాడేరు నుంచి ఎన్నికైన గిడ్డి ఈశ్వరి, సోమవారం నాడు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం నాడు ఆమె స్వయంగా వెల్లడించారు.

విశాఖ జిల్లాలో అభివృద్ధే తనకు ముఖ్యమని, కార్యకర్తల అభీష్టం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా ఈశ్వరి వ్యాఖ్యానించారు. జగన్ పై విమర్శలు చేస్తూ, తాను పార్టీ మారితేనే పాడేరు అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. కాగా, పార్టీ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న తనలాంటి వారిని జగన్ పక్కనబెట్టడంతోనే మనస్తాపం చెందినట్టు ఈశ్వరి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. జగన్ పక్కనే తిరుగుతున్న విజయసాయిరెడ్డి కారణంగానే తాను పార్టీ మారవలసి వస్తోందని ఈశ్వరి వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News