Mumbai: సర్వీస్ చార్జీగా రూ.181 వసూలు చేసి భారీ మూల్యం చెల్లించుకున్న హోటల్!

  • హోటల్ తీరుపై కన్జుమర్ ఫోరాన్ని ఆశ్రయించిన బాధితుడు
  • పరిహారంగా రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశం
  • హోటల్ యాజమాన్యాలకు చెంపపెట్టు అన్న బాధితుడు

వినియోగదారుడి నుంచి 181 రూపాయలను సర్వీసు చార్జీగా వసూలు చేసిన ఓ హోటల్ భారీ మూల్యం చెల్లించుకుంది. సర్వీస్ విధింపుపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించిన బాధితుడు విజయం సాధించాడు. బాధితుడి నుంచి వసూలు చేసిన సర్వీసు చార్జీతోపాటు పదివేల రూపాయలను తక్షణం అతడికి చెల్లించాలని ఫోరం తీర్పు చెప్పింది.

ముంబైకి చెందిన జై జీత్ సింగ్ ఆగస్టులో తన భార్యతో కలిసి నగరంలోని పంజాబ్ గ్రిల్ అనే హోటల్‌కు వెళ్లాడు. భోజనానంతరం హోటల్ సిబ్బంది అతడికి రూ.181.5 సర్వీసు చార్జీతో కలిపి బిల్లు అందించారు. సర్వీసు చార్జీ చెల్లించేంత స్థాయిలో ఆహారం లేదని, తాను చెల్లించబోనని జై జీత్ తేల్చి చెప్పాడు. అయితే సర్వీసు చార్జీ చెల్లించాల్సిందేనని సిబ్బంది పట్టుబట్టారు. ఈ విషయంలో మేనేజర్‌ను కలిసినా ఫలితం లేకపోవడంతో జై జీత్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.

కేసును విచారించిన కన్జుమర్ ఫోరం హోటల్ తీరును తప్పుబట్టింది. వినియోగదారుడి నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసి ఆవేదనకు గురిచేసినందుకు గాను రూ.5 వేలు, వసూలు చేసిన సర్వీసు ట్యాక్స్‌కు వడ్డీతో కలిసి మరో రూ.5 వేలను తక్షణం అందించాల్సిగా ఆదేశించింది. ఈ తీర్పు హోటల్ యాజమాన్యాలకు ఓ చెంపపెట్టు అని జై జీత్ పేర్కొన్నారు. సర్వీసు ట్యాక్స్ నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలామంది మౌనంగా చెల్లిస్తున్నారని, అటువంటి వారికి ఈ తీర్పు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.

More Telugu News