Ivanka Trump: ఇవాంకా హైదరాబాద్ పర్యటన ఎఫెక్ట్.. ట్రంప్ సర్కారులో చీలికలు!

  • అమెరికా బృందానికి ఇవాంకా సారథ్యంపై టిల్లర్‌సన్ కినుక
  • సీనియర్ నేతలను పంపకుండా అడ్డుకున్న విదేశాంగ మంత్రి
  • కోడై కూస్తున్న అమెరికా పత్రికలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, శ్వేతసౌధ సలహాదారు అయిన ఇవాంకా రాక కోసం హైదరాబాద్ ముస్తాబవుతుంటే మరోవైపు ట్రంప్ సర్కారులో చీలికలు మొదలయ్యాయి. ప్రపంచ  పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతున్న అమెరికా బృందానికి ఇవాంకా సారథ్యం వహిస్తుండడంపై విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ కినుక వహించినట్టు తెలుస్తోంది. అందుకే ఈ సదస్సులో ముఖ్య అధికారులు ఎవరూ పాల్గొనడం లేదని అమెరికాలోని ప్రముఖ పత్రికలన్నీ పేర్కొన్నాయి.

సాధారణంగా ఇటువంటి  సదస్సులకు విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతస్థాయి బృందాలు కూడా హాజరవుతాయి. అయితే డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ హోదాకు మించిన వారెవరూ హాజరు కావడం లేదు. టిల్లర్‌సన్ కార్యకలాపాల్లో ఇవాంకా తలదూర్చుతుండడంతో ఆయన కినుక వహించారని పత్రికలు పేర్కొన్నాయి. భారత ప్రభుత్వంతో కలిసి అమెరికా విదేశాంగ శాఖ నిర్వహిస్తున్న ఈ సదస్సుకు నిజానికి ఆ శాఖామంత్రి నేతృత్వం వహించాలి. అయితే వైట్ హౌస్ జోక్యం కారణంగా  ఇవాంకా సారథ్యం వహిస్తున్నారు. ఇది టిల్లర్‌సన్‌కు  నచ్చలేదని, అందుకే సీనియర్ అధికారులను ఎవరినీ సదస్సుకు పంపడం లేదని సీఎన్ఎన్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

More Telugu News