raghuveera reddy: ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే ముగ్గురు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు: ర‌ఘువీరారెడ్డి

  • రాష్ట్రంలో నకిలీ విత్తనాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది
  • అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు
  • డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడాలి  
  • రుణ‌మాఫీ అనేది రైతులకు అందని ద్రాక్షలాగా‌ మిగిలిపోయింది

న‌కిలీ విత్తనాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన కృష్ణా జిల్లా గంప‌ల‌గూడెం మండ‌లానికి చెందిన తిరుప‌త‌య్య‌, పూర్ణ‌య్య‌, రామ‌య్య అనే ముగ్గురు రైతులు ఒకేసారి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. వారికి ఏపీసీసీ సంతాపం ప్ర‌క‌టించింది. విజ‌య‌వాడ‌లో ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నకిలీ మిర్చి విత్తనాలతో పంట నష్టపోవడంతో గంపలగూడెంకు చెందిన రైతులు నష్ట పరిహారం కోసం పోరాడుతున్నప్ప‌టికీ ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా రుపాయి కూడా చెల్లించ‌లేద‌ని అన్నారు.

నర్సరీలకు సంబంధించి టీడీపీ, వైసీపీకి చెందిన వారు ఉన్నారు కాబట్టే ఈ కేసులో కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేశారని ర‌ఘువీరారెడ్డి ఆరోపించారు. రైతు మీద‌ రౌడీషీట్ తెరవడాన్ని తాము తప్పుబడుతున్నామ‌ని అన్నారు. న్యాయం చేయమని కోరితే క్రిమినల్‌ కేసులు, రౌడీషీట్ తెరవడం దుర్మార్గమ‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని చెప్పారు. రాజకీయ నాయకులే నకిలీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుండడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు.

డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ప్రభుత్వం మాట్లాడి క్రషింగ్ చేయించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ర‌ఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. యజమాని రన్‌ చేయలేడంటే రైతులకు ఇబ్బందికర పరిస్ధితి ఏర్పడుతుందని అన్నారు. డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. రుణ‌మాఫీ పొందని రైతులు రాష్ట్రంలో చాలా‌మంది ఉన్నారని తెలిపారు. సాధికారిత సంస్ధలో సాయం చేసేది పోయి, సహాయ నిరాకరణ జరుగుతోందని ఎద్దేవా చేశారు. రుణ‌మాఫీ అనేది రైతులకు అందని ద్రాక్షలాగా‌ మిగిలిపోయిందని అన్నారు. ఎంత మందికి రైతు రుణ‌మాఫీ చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.

సింగపూర్ కు పది మంది రైతులను ఎందుకు పంపించారో అర్థం కావడం లేదని ర‌ఘువీరారెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన వారి పెళ్లిళ్లు ఉన్నాయని మూడు రోజులు అసెంబ్లీకి సెలవులు ఇవ్వడం దుర్మార్గమ‌ని అన్నారు. ఎమ్మెల్యేలు మరో రోజు సెలవు పెట్టి గంపలగూడెంలొ రైతులను, డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీని సందర్శించాల‌ని కోరారు. పెళ్లిళ్లు ముఖ్యమా? ప్రజా‌ సమస్యలు ముఖ్యమా? అని ప్ర‌శ్నించారు. పెళ్లిళ్ల‌ కోసం అసెంబ్లీకి సెలవులు ఇవ్వడంపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నామ‌ని అన్నారు.

ఫాతిమా మెడికల్‌ కాలేజి స్టూడెంట్స్ గత 26 రోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ర‌ఘువీరారెడ్డి అన్నారు. ఫాతిమా కాలేజి విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుంటామంటున్నా ప్రభుత్వానికి కనబడదా? అని ప్ర‌శ్నించారు. తాము ఫాతిమా విద్యార్థుల‌కు అండగా ఉంటామ‌ని తెలిపారు. గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం కాపాడలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి డాష్ బోర్డు ఉందని విమ‌ర్శించారు.

More Telugu News