second test: శ్రీలంక ఆలౌట్... ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన భారత్!

  • 205 పరుగులకు శ్రీలంక ఆలౌట్
  • టాప్ స్కోరర్ చండిమల్ (57)
  • 7 వికెట్లను కూల్చిన స్పిన్నర్లు

నాగపూర్ లో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజే శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ధాటికి లంక బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. 79.1 ఓవర్లు ఎదుర్కొన్న శ్రీలంక 205 పరుగులకు ఆలౌట్ అయింది. అశ్విన్ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ ముగ్గుర్ని పెవిలియన్ చేర్చాడు. శ్రీలంక బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ చండిమల్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కరుణరత్నే 51 పరుగులతో మరో హాఫ్ సెంచరీ సాధించాడు. మిగిలిన వారిలో సమరవిక్రమ 13, తిరిమన్నె 9, మాథ్యూస్ 10, డిక్ వెల్లా 24, షనక 2, పెరీరా 15, హెరాత్ 4, లక్మల్ 17 పరుగులు చేశారు. గమాగే పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు.

తిరిమన్నె, చండిమల్, షనక, హెరాత్ లను అశ్విన్ ఔట్ చేయగా... మ్యాథ్యూస్, డిక్ వెల్లా, పెరీరాలను జడేజా బలిగొన్నాడు. ఓపెనర్లు సమరవిక్రమ, కరుణరత్నే లతో పాటు లక్మల్ లను ఇషాంత్ ఔట్ చేశాడు.

అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ను ప్రారంబించింది. కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. తొలి బంతినే బౌండరీగా మలిచిన రాహుల్ 7 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. గమాగే బౌలింగ్ లో ఔట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్తున్న బంతిని రాహుల్ ఆడబోగా... ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. మరో ఎండ్ లో ఉన్న విజయ్ ఇంకా ఖాతాను ఆరంభించలేదు. భారత్ ప్రస్తుత స్కోరు 3.5 ఓవర్లకు 7 పరుగులు. 

More Telugu News