godavari water: తమిళనాడుకు గోదావరి జలాలు: నితిన్ గడ్కరీ

  • పోలవరం నుంచి కర్ణాటక, తమిళనాడుకు గోదావరి జలాలు
  • ఇంద్రావతి నీరు సాగర్ మీదుగా తమిళనాడుకు
  • 90 శాతం నిధులు కేంద్రానివే

తాగు, సాగునీటి కోసం అల్లాడుతున్న తమిళనాడుకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త అందించారు. గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలిస్తామని తెలిపారు. దీనికోసం, గోదావరి నదిని కావేరి నదితో అనుసంధానిస్తామని చెప్పారు. దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని చేపట్టనున్నామని చెప్పారు. రుతుపవనాలపైనే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని... వర్షాలు కురవకపోతే తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ప్రతి సంవత్సరం గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని... నదుల అనుసంధానంతో ఈ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని చెప్పారు.

గోదావరి నీటిని కృష్ణా, పెన్నా నదుల మీదుగా కావేరికి తరలిస్తామని చెప్పారు. పథకం తొలి విడతలో భాగంగా పోలవరం డ్యాం మీదుగా 300 టీఎంసీలను నాగార్జునసాగర్ కు... అక్కడి నుంచి సోమశిల-పెన్నా నది మీదుగా కావేరికి తరలిస్తామని తెలిపారు. ఈ పథకం అమలైతే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అదనంగా 100 టీఎంసీల నీటిని పొందే అవకాశం ఉందని చెప్పారు. రెండో దశలో ఇంద్రావతి నీటిని నాగార్జునసాగర్ కు... అక్కడి నుంచి సోమశిల మీదుగా కర్ణాటకతో అనుసంధానం కాకుండా కావేరి నదికి తరలిస్తామని పేర్కొన్నారు. ఈ పథకానికి 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుందని, మిగిలిన 10 శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని తెలిపారు.

More Telugu News