Tamilnadu: సత్యభామ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య... విధ్వంసం సృష్టించిన తెలుగు విద్యార్థులు!

  • కంప్యూటర్ ఇంజనీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతున్న రాగ రాధ మౌనికారెడ్డి 
  • ఇంటర్నల్ ఎగ్జామ్ లో కాపీ కొట్టిందని, పరీక్షలకు అనుమతించని అధ్యాపకులు 
  • అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని 

తమిళనాడు, చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో హైదరాబాదుకు చెందిన రాగ రాధ మౌనికా రెడ్డి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. యూనివర్సిటీలో ఆమె కంప్యూటర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షలో కాపీకి పాల్పడిందంటూ పరీక్ష హాల్ నుంచి ఆమెను అధ్యాపకులు బయటకు పంపించేశారు. అనంతరం ఇతర పరీక్షలు రాసేందుకు కూడా ఆమెకు అనుమతి ఇవ్వలేదు. దీనిని అవమానంగా భావించిన రాధ మౌనిక 'మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్' అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 అంతకు ముందు, అదే కళాశాలలో చదువుతున్న సోదరుడితో వీడియో కాల్ మాట్లాడింది. దీంతో ఆమెను అనునయించడానికి హుటాహుటీన ఆమె ఉంటున్న హాస్టల్ కు చేరుకున్న సోదరుడ్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అతను ఎంత ప్రాధేయపడినా వారు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె ఆత్మహత్యను ఆపలేకపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తెలుగు విద్యార్థులు కళాశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. యూనివర్సిటీ బస్సులకు నిప్పుపెట్టారు. మంటలు ఎగసిపడడంతో వాటిని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రాగా, వారిని విద్యార్థులు అడ్డుకున్నారు.

More Telugu News