maria sharapova: టెన్నిస్ స్టార్ షరపోవాపై ఇండియాలో చీటింగ్ కేసు నమోదు!

  • ఢిల్లీలోని ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా షరపోవా
  • 2012లో భారీ మొత్తంలో ఒప్పందాలు.. ఇంత వరకు ప్రారంభం కాని నిర్మాణాలు
  • షరపోవా వల్లే ఫ్లాట్లను బుక్ చేసుకున్నామంటూ ఆమెపై కేసు

టెన్నిస్ స్టార్ మరియా షరపోవాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. చీటింగ్, నేరపూరిత కుట్ర అభియోగాల కింద కేసు ఫైల్ చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే, హోంస్టెడ్ అనే రియలెస్టేట్ కంపెనీ 'బాలెట్ బై షరపోవా' పేరుతో విలాసవంతమైన అపార్ట్ మెంట్లను నిర్మించేందుకు 2012లో భారీ మొత్తంలో పెట్టుబడులను సేకరించింది. ఈ వెంచర్ ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ లో ఉంది.

ఈ కంపెనీకి షరపోవా బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించింది. 2012లో ఇండియా టూర్ కు వచ్చిన సందర్భంగా ఈ కంపెనీతో ఆమె ఎండోర్స్ మెంట్ కుదుర్చుకుంది. దీంతో, చాలా మంది భారీ మొత్తంలో డబ్బులను చెల్లించి, ఫ్లాట్ లను బుక్ చేసుకున్నారు. ఈ వెంచర్ లో హెలీప్యాడ్, క్లబ్ హౌస్, టెన్నిస్ అకాడమీలు ఉంటాయని సంస్థ ప్రతినిధులు ప్రకటించడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు.

2013 లో సంస్థకు, కొనుగోలుదార్లకు మధ్య కోట్లాది రూపాయల ఒప్పందాలు జరిగాయి. అయినప్పటికీ, ఇంతవరకు నిర్మాణాలు మాత్రం మొదలు కాలేదు. దీంతో, కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొనుగోలుదార్లకు అనువైన రీతిలో ప్రత్యేకమైన, భిన్నమైన నివాసాలను అందించడమే తమ లక్ష్యమని షరపోవా చెబుతున్నట్టు కంపెనీ వెబ్ సైట్లో ఉంది.

దీంతో, ఈ కేసులో ఆమెను కూడా చేర్చామని ఒక కొనుగోలుదారుడి తరపున ఉన్న న్యాయవాది పీయూష్ సింగ్ తెలిపారు. ఏదైనా సంస్థకు ఎవరైనా బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారంటే... టెక్నికల్ గా వారు కంపెనీ ఏజెంట్ కిందకు వస్తారని చెప్పారు. బ్రాండ్ అంబాసడర్ గా షరపోవా ఉండకపోతే... ఏ ఒక్కరు కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేవారు కాదని అన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

More Telugu News