Nara Lokesh: సినీ కళాకారులకు లోకేశ్‌ క్షమాపణ చెప్పాలి: న‌ంది అవార్డుల వివాదంపై ఏపీసీసీ

  • ప్రకటించిన నంది అవార్డులను రద్దు చేయాలి
  • ఏపీలో రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేనివారు మాట్లాడటం తప్పా?
  • మంత్రి లోకేశ్‌ కళాకారులకు ప్రాంతాలను ఆపాదించారు
  • కమిటీలోని సభ్యులను రేషన్ కార్డు, ఆధార్ కార్డులు చూసే నియమించారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల‌పై ఎన్న‌డూ లేనంత‌గా విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీసీసీ త‌ప్పు బ‌ట్టింది. నంది అవార్డుల‌పై విమర్శలు చేసిన దర్శకుల్ని, నటులను ఉద్దేశించి మంత్రి లోకేశ్.. నాన్ రెసిడెన్షియల్స్ అని, ఏపీలో రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేనివారని మాట్లాడటం తప్పని అన్నారు. లోకేశ్‌ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ అన్నారు.

నంది అవార్డులకు కులం ఆపాదించవద్దని అంటూనే మంత్రి లోకేశ్‌ కళాకారులకు ప్రాంతాలు ఆపాదించారని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం నియమించిన కమిటీలోని సభ్యులను రేషన్ కార్డు, ఆధార్ కార్డులు చూసే నియమించారా? అని ప్ర‌శ్నించారు. వారి నివాసం ఎక్కడో చూసే నటులకు అవార్డులు ఇచ్చారా? అధిక అవార్డులు పొందిన బాలకృష్ణ రెసిడెన్స్ ఎక్కడ వుంది? అనే ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజకీయ ప్రమేయంతో నంది అవార్డుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు వచ్చినందున  ప్రకటించిన అవార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఛ‌లో అసెంబ్లీ సంద‌ర్భంగా నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేయించిన అరెస్టుల‌కు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యం ముందు నిర‌స‌న తెలిపారు.

More Telugu News