Posani Krishna Murali: నంది అవార్డును తిరస్కరిస్తున్నా.. లోకేష్ మంత్రి కావడం మా ఖర్మ: పోసాని కృష్ణమురళి

  • తెలంగాణలో ట్యాక్స్ కడుతున్నంత మాత్రాన మేం మాట్లాడకూడదా?
  • ఐవీఆర్ఎస్ ద్వారా అవార్డులను మళ్లీ ఎంపిక చేయండి
  • తెలంగాణ ప్రజలకు పాదాభివందనం

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఘాటుగా స్పందించాడు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తాము ఎన్నారైలు అయితే లోకేష్ ఎవరని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ తిట్టలేదని చెప్పారు. ఏపీ రాజకీయ నేతలను మాత్రమే తిట్టారని అన్నారు. లోకేష్ కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే... మమ్మల్ని తరిమికొట్టేవారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు.

నారా లోకేష్ మంత్రి కావడం తమ ఖర్మ అని పోసాని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అయితే... తాము తెలుగు రోహింగ్యాలమవుతామని చెప్పారు. తెలంగాణలో పన్నులు కడుతున్నందుకు... తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా? అని అడిగారు. ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా? అని అన్నారు.

తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని... ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే, అప్పుడు తీసుకుంటానని చెప్పారు. నంది అవార్డులను రద్దు చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా మళ్లీ ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News