jeevitha rajasekhar: చిరంజీవి, అల్లు అరవింద్ లకు లేని బాధ వీళ్లకెందుకు?: 'నంది' విమర్శకులకు జీవిత ఘాటు జవాబు

  • లైవ్ షోలలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు
  • ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు
  • చిరంజీవి, అల్లు అరవింద్ లకు లేని బాధ పక్కవాళ్లకెందుకు?

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి సైకిల్ అవార్డులు అంటూ కొందరు, కమ్మ అవార్డులు అంటూ మరికొందరు... ఇలా ఎవరికి తోచిన విమర్శలు వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2015 సంవత్సరానికి జ్యూరీ ఛైర్మన్ గా వ్యవహరించిన జీవిత ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. మూడు నెలల పాటు సినిమాలన్నింటినీ ఓపికగా చూసి, అవార్డ్ విజేతలను ఎంపిక చేశామని ఆమె తెలిపారు. అవార్డుల ఎంపికకు సంబంధించి తమపై ఏ రాజకీయ నాయకుడి ప్రభావం లేదని చెప్పారు. నెగెటివ్ గా ఆలోచించే వారికి అన్నీ తప్పులే కనిపిస్తాయని విమర్శించారు.

ఈ అవార్డుల గురించి జనాలు మాట్లాడుకోవడం లేదని... సినీ పరిశ్రమకు చెందిన వారే టీవీ లైవ్ షోలలో కూర్చుని ఇండస్ట్రీ పరువు తీస్తున్నారంటూ జీవిత మండిపడ్డారు. వీరి వ్యవహారం తనను ఎంతో బాధించిందని చెప్పారు. 'రుద్రమదేవి' సినిమా గురించి మాట్లాడుతూ, ఈ కేటగిరీలో కూడా తీవ్రమైన పోటీ ఉందని, అన్ని కోణాల్లో పరిశీలించి ఉత్తమ చిత్రాన్నే ఎంపిక చేశామని తెలిపారు. బాగా తీసిన సినిమాను బాగోలేదు అని చెప్పడం తమకేమైనా సరదానా? అని అన్నారు.

 జ్యూరీ ప్రాసెస్ ఎలా జరిగిందో తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అర్హత ఎవరికీ లేదని చెప్పారు. సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ పేరును ఎంట్రీకి పంపి ఉండవచ్చని... అయినా, అది మంచి పాత్ర కావడంతో ఎస్వీ రంగారావు పేరుతో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డుని ఇచ్చామని తెలిపారు. దీన్ని తాము ఒక గొప్ప విషయంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయం గురించి చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఎవరూ మాట్లాడలేదని... బయటివాళ్లు మాత్రమే మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

More Telugu News