Deepika Padukone: ‘పద్మావతి’ ఎఫెక్ట్: దీపిక పదుకొనేకు భారీ భద్రత

  • బెదిరింపుల నేపథ్యంలో దీపికకు ప్రత్యేక భద్రత
  • శూర్పణఖ ముక్కును లక్ష్మణుడు కోసినట్టు కోసేస్తామని హెచ్చరించిన కర్ణిసేన
  • ఆది నుంచీ ‘పద్మావతి’ వివాదాలమయమే
బాలీవుడ్ సినిమా ‘పద్మావతి’ వేడి రోజురోజుకు మరింతగా రాజుకుంటోంది. చరిత్రను వక్రీకరించి ఈ సినిమాను తెరకెక్కించారని ఆరోపిస్తూ రాజ్‌పుత్ కర్ణిసేన తొలి నుంచి ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇటీవల ఇవి మరింత ఉద్ధృతమయ్యాయి. ‘పద్మావతి’ని ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్న నిరసనకారులు గురువారం దీపిక ముక్కు కోస్తామని హెచ్చరించారు. శూర్పణఖ ముక్కును లక్ష్మణుడు కోసినట్టు తాము దీపిక ముక్కు కోస్తామని కర్ణిసేన అధ్యక్షుడు హెచ్చరించారు.

ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘రాజ్‌పుత్ ‌లు ఎప్పుడూ మహిళలపై చేయి లేపరు. అవసరం అయితే శూర్పణఖ ముక్కును లక్ష్మణుడు కోసినట్టు మేం దీపిక ముక్కు కోస్తాం’’ అని అందులో పేర్కొన్నారు. అంతేకాదు ‘పద్మావతి’ చిత్రానికి వ్యతిరేకంగా డిసెంబరు 1న దేశవ్యాప్త బంద్ నిర్వహించనున్నట్టు తెలిపారు.

కాగా, దీపిక ముక్కు కోస్తామని, చంపేస్తామని బెదిరింపులు ఎక్కువ కావడంతో నటి దీపికకు ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమెకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. దర్శకుడు బన్సాలీ ‘పద్మావతి’ సినిమాను ప్రకటించినప్పటి నుంచే వివాదం మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైపూర్‌లో ఆయనపై రాజ్‌పుత్ కర్ణిసేన కార్యకర్తలు దాడి చేశారు.
Deepika Padukone
Padmavati
Bollywood

More Telugu News