prashanth kishor: కడప హోటల్లో దౌర్జన్యానికి తెగబడ్డ జగన్ సలహాదారు పీకే టీమ్!

  • కడపలోని ఓ ప్రముఖ హోటల్ లో పీకే టీమ్ బస
  • నెల రోజుల పాటు అక్కడే మకాం
  • లక్షలకు చేరిన బిల్లు

2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త అయిన పీకే (ప్రశాంత్ కిషోర్)ను ఆయన సలహాదారుగా నియమించుకున్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్రలో కూడా పీకే బృందం పాల్గొంటోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తోంది. ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనికి 15 రోజుల ముందే పీకే టీమ్ కడపకు చేరుకుంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో పీకే టీమ్ కు చెందిన 15 మంది బస చేశారు. జగన్ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను అనుసరించి వీరు ఓ సర్వే చేశారట. ఆయా ప్రాంతాల్లో ప్రజల స్పందన ఎలా ఉందన్న విషయంలో ఓ అంచనాకు వచ్చారట.

జగన్ పాదయాత్ర సందర్భంగా కూడా వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్ వెంటే ఉంటూ... రాత్రికి కడపలోని హోటల్ కు చేరుకునేవారు. వీరందరి కోసం కడపలోని హోటల్ లో 6 ఏసీ గదులను ఏర్పాటు చేశారు. అంతేకాదు, వీరికి ప్రత్యేకమైన భోజన ఏర్పాట్లను కూడా హోటల్ యాజమాన్యానికే అప్పగించారట. సుమారు నెల రోజుల పాటు ఆ హోటల్ లోనే పీకే టీమ్ బస చేసింది. 13వ తేదీతో కడప జిల్లాలో జగన్ పాదయాత్ర ముగిసి, కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది.

దీంతో కడపలోని హోటల్ ను ఖాళీ చేసేందుకు పీకే టీమ్ రెడీ అయింది. అయితే, వీరి ఖర్చు మాత్రం లక్షల రూపాయలకు చేరిందట. దీంతో, సొమ్ము చెల్లించిన తర్వాతే హోటల్ గదులను ఖాళీ చేసి వెళ్లాలని, హోటల్ యాజమాన్యం పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో, బిల్లుకు, తమకు సంబంధం లేదని... ఆన్ లైన్లో పేమెంట్ జరగుతుందంటూ హోటల్ సిబ్బందిని వీరు దబాయించారట. దీంతో, వీరిపై హోటల్ యాజమాన్యం కూడా సీరియస్ అయిందని సమాచారం. 'ఎక్కడ నుంచో ఇక్కడకు వచ్చి, మమ్మల్నే బెదిరిస్తారా? ముందు బిల్లు చెల్లించి ఇక్కడ నుంచి కదలండి' అంటూ హెచ్చరించారట.

దీంతో పీకే టీమ్ చేసేదేమీ లేక వైసీపీ నేతలకు ఫోన్ చేయగా... వారు వచ్చి హోటల్ యాజమాన్యంతో మాట్లాడి, వారిని ఒప్పించారట. అనంతరం వీరు అక్కడ నుంచి బయటపడ్డారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆ హోటల్ వైసీపీకి చెందిన ఒక నాయకుడిదే!

More Telugu News