అశోక్ గజపతి: కేంద్ర మంత్రిగా అశోక్ గజపతి రాజు రికార్డు!

  • 2014లో పౌరవిమానయాన శాఖ బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతి రాజు
  • సుదీర్ఘ కాలం కొనసాగుతున్న ఏకైక మంత్రి
  • నిరుపయోగంగా ఉన్న 80 ఎయిర్ పోర్టులను అందుబాటులోకి తెచ్చిన మంత్రి
  • పౌర విమాన యాన శాఖను ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 3వ స్థానంలో నిలిపిన ఘనత

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు రికార్డులకెక్కారు. పౌరవిమానయాన శాఖకు సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న ఏకైక మంత్రిగా చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ చేరింది. దీంతో, 2014లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజు అదే శాఖ మంత్రిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆ శాఖ బాధ్యతలను ఆయన 42 నెలలుగా నిర్వహిస్తూ రికార్డు నెలకొల్పడం విశేషం. అశోక్ గజపతి రాజు హయాంలో పౌర విమానయాన శాఖ సాధించిన పురోగతి గురించి చెప్పాలంటే.. దేశ వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న 80 ఎయిర్ పోర్ట్ లను అందుబాటులోకి తెచ్చారు.

సామాన్యుల కోసం ప్రాంతీయ అనుసంధాన పథకం (రీజనల్ కనెక్టవిటీ స్కీమ్)ను రూపొందించారు. ఈ పథకం కింద చిన్నతరహా పట్టణాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేసి, అక్కడికి విమాన రాకపోకలు జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ ఎయిర్ పోర్టులకు రాకపోకలు సాగించే విమానాల్లో మధ్య తరగతి వర్గాల ప్రజల కోసం తక్కువ ధరలకే విమాన టికెట్లను విక్రయించడం మొదలు, వారి కోసం సీట్లను రిజర్వ్ చేసేలా నిబంధనలు రూపొందించారు.

అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ బాధ్యతలను స్వీకరించే నాటికి సరళతర వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్)లో ఆ శాఖ 10వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 3వ స్థానంలో నిలిచింది. పౌర విమానయాన శాఖ డెబ్భై ఏళ్లలో సాధించిన అభివృద్ధి అంతా ఒక ఎత్తు అయితే, అశోక్ గజపతిరాజు హయంలో జరిగిన అభివృద్ధి మరో ఎత్తుగా చెప్పవచ్చు.

More Telugu News