China: చైనాకు షాక్.. డైమెర్-బాషా డ్యామ్ నిర్మాణం నుంచి దయచేయమన్న పాక్!

  • డ్రాగన్ కంపెనీల నిబంధనలకు విలవిల
  • ప్రాజెక్టును తమకు వదిలేయమన్న పాక్
  • సొంతంగా నిధులు సమకూర్చుకోవాలని యోచన

మిత్రదేశం చైనాకు పాకిస్థాన్ షాకిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో డైమెర్-బాషా డ్యామ్ నిర్మాణానికి 14 బిలియన్ డాలర్ల సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. ప్రస్తుతం పాక్‌లో 60 బిలియన్ డాలర్లతో చైనా నిర్మిస్తున్న చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)‌లో భాగంగా డైమెర్-బాషా డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా అంగీకరించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడీ ప్రాజెక్టును తమకు వదిలేయాలని పాక్ చైనాను కోరినట్టు తెలుస్తోంది. ఈ డ్యామ్‌ను తాము  సొంతంగా నిర్మించుకుంటామని చైనాకు తేల్చిచెప్పినట్టు పాకిస్థాన్ దినపత్రిక ఒకటి పేర్కొంది.

ఈ డ్యామ్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ను పాక్ పలుమార్లు కోరింది. అయితే డ్యామ్ నిర్మాణ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగమంటూ భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఏడీబీ వెనక్కి తగ్గింది. దీంతో ఆ డ్యామ్‌ నిర్మాణానికి తాము సాయం చేస్తామంటూ చైనా ముందుకొచ్చింది.

డ్యామ్ నిర్మాణానికి ముందుకొచ్చిన చైనా కంపెనీలు విధించిన నిబంధనలు కఠినంగా ఉండడం, నిర్మాణానికి 5 బిలియన్ డాలర్లు అవుతుందని అంచనా వేస్తే ఆయా కంపెనీలు దానిని ఏకంగా 14 బిలియన్ డాలర్లకు చేర్చడం తదితర కారణాలతో పాక్ వెనక్కి తగ్గినట్టు ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పేర్కొంది. అంత సొమ్మును భరించడం కంటే తామే సొంతంగా నిధులు సమకూర్చుకుని ప్రాజెక్టును చేపట్టాలని పాక్ నిర్ణయించింది. ఈ మేరకు చైనాకు సమాచారం అందించింది.

More Telugu News