reshma patel: హార్దిక్ పటేల్ కు హ్యాండిచ్చిన రేష్మా పటేల్.. బీజేపీలో చేరిక!

  • బీజేపీలో చేరిన యువ మహిళా నేత
  • మొన్నటి వరకూ హార్దిక్ వెన్నంటి ఉన్న రేష్మా
  • అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేసిన బీజేపీ
  • హార్దిక్ పై విమర్శల వర్షం కురిపించిన వైనం 

రేష్మా పటేల్... నిన్న మొన్నటి వరకూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితిలో క్రియాశీలకంగా ఉంటూ, హార్దిక్ పటేల్ వెన్నంటి నిలిచిన యువ మహిళా నేత. ప్రస్తుతం ఆమె హార్దిక్ కు హ్యాండిచ్చి బీజేపీలో చేరిపోయారు. బీజేపీ ఆమెకు అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేస్తుండగా, రాజకీయాల్లో రాణించాలన్న లక్ష్యంతో రేష్మ అడుగులు వేస్తున్నారు. పనిలోపనిగా హార్దిక్ పై విమర్శల వర్షం గుప్పించారు. "గుజరాతీలందరికీ హార్దిక్ ఎటువంటి వాడో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. మహిళల సాధికారత, గౌరవంపై ఇక ఆయనకు మాట్లాడే హక్కులేదు. తన పబ్బం గడుపుకోవడానికే ఆయన బీజేపీని విమర్శిస్తున్నారు" అని ఆమె నిప్పులు చెరిగారు.

కాగా, భర్తను వదిలేసి, కవల పిల్లలకూ దూరంగా ఉంటూ తనను తాను అనాధగా చెప్పుకునే 32 ఏళ్ల రేష్మ, అక్టోబర్ రెండో వారం వరకూ హార్దిక్ కు చాలా సన్నిహితురాలిగానే ఉన్నారు. ఆయన చేసిన ఆందోళనల్లో వెన్నంటి నిలిచారు. హార్దిక్ జైలుకు వెళ్లినప్పుడు గుజరాత్ లో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నిరసనలకు తనే నాయకత్వం వహించారు. అప్పట్లో నిరవధిక నిరాహారదీక్షకు దిగేందుకు సైతం వెనుకాడలేదు. ఆమెను అరెస్ట్ చేసిన ప్రభుత్వం, నెల రోజుల పాటు సబర్మతీ జైలులో ఉంచింది కూడా.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గుజరాత్ లో పటేళ్ల హక్కులను కాపాడేందుకు తన జీవితాన్ని అంకితమిస్తున్నానని చెప్పుకుంటూ, అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరిపోయారు. కాగా, ఇటీవలి రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో భాగంగా రేష్మను కలిసేందుకు ఆయన ఆసక్తి చూపలేదని, ఈ కారణంతోనే రేష్మ బీజేపీకి దగ్గరైందని తెలుస్తోంది. "పటేళ్లకు రిజర్వేషన్లపై మీ అభిప్రాయాన్ని చెప్పాలని రాహుల్ గాంధీకి నేనో లేఖ రాశాను. దానికి ఆయన్నుంచి సమాధానం రాలేదు" అని రేష్మ వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News