Bill Gates: భూతల స్వర్గాన్ని నిర్మించేందుకు 25 వేల ఎకరాలు కొనుగోలు చేసిన అపరకుబేరుడు!

  • ఆరిజోనా రాష్ట్రంలో 'బెల్ మోంట్ నగరం' నిర్మించనున్న బిల్ గేట్స్
  • 523.7 కోట్లతో 25 వేల ఎకరాల కొనుగోలు
  • 80 వేల నివాస గృహాల నిర్మాణం
  • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వేగవంతమైన సాంకేతిక సమాచార వ్యవస్థ. 

భూతలస్వర్గాన్ని నిర్మించేందుకు అపరకుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నడుంబిగించారు. సరికొత్త మేధో నగర నిర్మాణానికి బెల్ మోంట్ పార్టనర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి బిల్ గేట్స్ అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో నీటి సౌకర్యం లేని ప్రాంతంలో 523.7 కోట్ల రూపాయలు వెచ్చించి 25 వేల ఎకరాలు కొనుగోలు చేశారు. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో, 'బెల్ మోంట్' పేరుతో నిర్మిస్తున్న ఈ నగరంలో 80 వేల నివాస గృహాలు, 3,800 ఎకరాల్లో పరిశ్రమలు, కార్యాలయాలు, 470 ఎకరాల్లో పాఠశాలలు నిర్మించనున్నట్టు కేపీఎన్ఎక్స్ మీడియా వెల్లడించింది.

బెల్‌ మోంట్‌ ప్రస్తుత సమాజం తరువాతి దశ మేధో సమాజాన్ని సృష్టిస్తుందని వారు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యధిక వేగవంతమైన సాంకేతిక సమాచార వ్యవస్థలు, కేంద్రాలు, సరికొత్త తయారీ పరిజ్ఞానాలు, పంపిణీ విధానాలు, సొంతంగా నడిచే కార్లు, ఇతర సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. అయితే ఈ నగర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఈ నగర నిర్మాణానికి ఎంత వ్యయమవుతుంది? వంటి వివరాలేవీ వెల్లడించకపోవడం గమనార్హం.  

More Telugu News