పోలీసులు బట్టలిప్పి కొట్టారు.. కేసీఆర్, చంద్రబాబు చంపెయ్యమన్నారన్నారు!: కలకలం రేపుతున్న యువకుడి సూసైడ్ సెల్ఫీ
- భార్యతో రాజీకి అత్తారింటికి వెళ్లిన రాజుపై దాడి చేసి పోలీసులకు అప్పగించిన బంధువులు
- స్టేషన్ లో బట్టలిప్పి చితక్కొట్టిన ఎస్సై సైదాబాబు
- ఎస్సై దురాగతాన్ని సెల్ఫీ వీడియోలో చెప్పి సూసైడ్ చేసుకున్న రాజు
తాను చేసిన తప్పేంటి? అని నిలదీయడంతో కేసీఆర్, చంద్రబాబు చంపేయమన్నారని, అందుకే కొడుతున్నామని ఎస్సై సమాధానం చెప్పాడని బాధితుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనను బట్టలిప్పించి గొడ్డును బాదినట్టు బాదారని కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ దెబ్బలకు నడవలేకపోతున్నానని, తొడలు కమిలిపోయాయని, ఇదేం న్యాయమని అడిగాడు. పోలీసులు ఇలాగేనా వ్యవహరించేది? అని నిలదీశాడు. మహిళలు కూడా ఆలోచించాలని, వారిది కూడా తప్పు ఉంటుందని, తప్పంతా మగాళ్ల మీదే తోసేయడం సరికాదని హితవు పలికాడు.
అనంతరం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మగతగా ఉన్న రాజును చూసిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ రాజు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతని అంత్యక్రియల సమయంలో అతని ఫోన్ లో ఈ సూసైడ్ వీడియో లభ్యమైంది. దీంతో ఎస్సై సైదాబాబును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.