Nepal: భారత్‌పై గెలుపు కన్నా.. ద్రవిడ్ మాటలకే ఉబ్బితబ్బిబ్బవుతున్న నేపాల్ క్రికెటర్లు!

  • ఆసియాకప్ అండర్-19లో భారత్‌పై నెగ్గిన నేపాల్
  • గెలుపు కంటే రాహుల్ అభినందనలే కిక్కిచ్చాయన్న ఆ జట్టు కోచ్
  • భారత్‌పై నేపాల్‌కు ఏ స్థాయిలోనైనా ఇదే తొలి విజయం

కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియా కప్ అండర్-19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుపై నేపాల్ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌పై ఏ స్థాయిలోనైనా నేపాల్‌కు ఇదే తొలి విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 185 పరుగులు చేసింది. అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 91/1తో పటిష్టంగా కనిపించినా తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. 166 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది.

డిఫెండింగ్ చాంపియన్ అయిన భారత్‌పై తొలి విజయం ఇచ్చిన కిక్కుకంటే రాహుల్ ద్రవిడ్ అన్న మాటలకే నేపాల్ క్రికెటర్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. భారత పరాజయం తర్వాత నేపాల్ జట్టును కలిసిన కోచ్ రాహుల్ ద్రవిడ్ వారిని అభినందించాడు. ఆ జట్టు కోచ్ బినోద్ కుమార్ దాస్‌ను కలిసి భుజం తట్టి కంగ్రాట్స్ చెప్పాడు. ఈ విజయానికి మీరు అన్ని విధాలా అర్హులంటూ కొనియాడాడు. అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. రాహుల్ మాటలతో నేపాల్ క్రికెటర్లు చిన్నపిల్లల్లా సంబరపడిపోయారు. భారత్‌పై గెలుపు సామాన్యమైన విషయం కాకపోయినా అంతకంటే ద్రవిడ్ అభినందనలే తమకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చాయని దాస్ పేర్కొన్నాడు. తమ కృషిని అభినందించినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. ద్రవిడ్ వినయం తమను మంత్రముగ్ధులను చేసిందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News