Congress: పడవ ప్రమాదంపై నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేసిన కాంగ్రెస్ పార్టీ

  • కృష్ణా నదిలో పడవ ప్రమాదం ఎంతగానో కలచివేసిందన్న ర‌ఘువీరారెడ్డి
  • ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌నే అనుమానాలు ఉన్నాయి
  • న‌దిలో అనుమతి లేని బోట్లే ఎక్కువగా నడుస్తున్నాయి
  • కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు

విజయవాడ సమీపంలో కృష్ణానదిలో చోటుచేసుకున్న పడవ ప్రమాదంపై కాంగ్రెస్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిజ‌నిర్థార‌ణ క‌మిటీని నియ‌మిస్తున్న‌ట్లు ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి తెలిపారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కృష్ణా నదిలో పడవ ప్రమాదం ఎంతగానో కలచివేసిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతోన్న‌ నేప‌థ్యంలో కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లంరాజు, మాజీ ఎమ్మెల్యే  మ‌స్తాన్ వ‌ల్లీ అధ్వ‌ర్యంలో ఈ నిజ‌నిర్థార‌ణ క‌మిటీని నియ‌మిస్తున్న‌ట్లు ర‌ఘువీరారెడ్డి తెలిపారు. న‌దిలో అనుమతి లేని బోట్లే ఎక్కువగా నడుస్తున్నాయని,  కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని,  ప్రధానంగా ఉండాల్సిన లైఫ్‌ జాకెట్లే ఉండటం లేదని అన్నారు. పలు బోట్లలో పరిమితికి మించి ప్రయాణికులను యథేచ్ఛగా ఎక్కిస్తున్నారని బాధితులు చేస్తోన్న అనేక‌మైన‌ ఆరోప‌ణ‌ల‌ను క‌మిటీ ప‌రిశీల‌న చేస్తుంద‌న్నారు.

 ఈ క‌మిటీలో ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌దర్శులు ప‌క్కాల సూరిబాబు, మీసాల రాజేశ్వ‌ర‌రావు, అధికార ప్ర‌తినిధులు, డీసీసీ అధ్య‌క్షుడు ధ‌నేకుల ముర‌ళీ, న‌గ‌ర కాంగ్రెస్ అద్య‌క్షులు ఆకుల శ్రీ‌నివాస్ కుమార్ ఉంటారన్నారు. ఈ క‌మిటీ ఈనెల 14న ఉద‌యం 10 గంట‌ల‌కు పవిత్ర సంగమం ప్రాంతాన్ని ప‌రిశీలిస్తుంద‌న్నారు. అదే విధంగా ఘ‌ట‌న‌లో మృతి చెందిన‌వారి బంధువులతోను, ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న వారితోను మాట్లాడి నివేదిక స‌మ‌ర్పిస్తార‌న్నారు. పున్నమి ఘాట్ ను ప‌రిశీలించి, అధికారుల‌తో మాట్లాడి, సంఘటన వివరాలను తెలుసుకుంటారని చెప్పారు.

More Telugu News