sasikala: శశికళ ఎగవేసిన పన్ను ...1,000 కోట్ల రూపాయలు!


  • 147 చోట్ల 1800 మంది ఐటీ సిబ్బంది ఏకకాలంలో దాడులు
  • 1000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన శశికళ
  • పెద్దనోట్ల రద్దు సమయంలో భారీగా అవకతవకలకు పాల్పడిన శశికళ, బంధువర్గం, సన్నిహితులు


పన్నుఎగవేత ఆరోపణలతో శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువర్గానికి సంబంధించిన 147 చోట్ల.. 1800 మంది ఐటీ సిబ్బంది ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా శశికళ సంబంధీకులు పది బోగస్ కంపెనీల పేరిట 1000 కోట్ల రూపాయల పన్నులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడ్డారని ఐటీశాఖ నిర్ధారించింది. బినామీ పేర్లతో 10 బోగస్‌ సంస్థలను ప్రారంభించిన శశికళ కుటుంబీకులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారని ఐటీ వర్గాలు తెలిపాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్‌ కంపెనీలు, సొంత వ్యాపారాలు, పార్టీ కార్యాలయాల ద్వారా పెద్దఎత్తున నగదు మార్పిడికి పాల్పడ్డారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

శశికళ డైరెక్టర్‌ గా ఉన్న ఫెన్సీ స్టీల్‌, రెయిన్‌ బో ఎయిర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శుక్రా క్లబ్‌, ఇండో -దోహ కెమికల్స్‌ అనే నాలుగు సంస్థలు గత నెలలో మూతపడ్డాయి. ఈ ఇండో-దోహా కెమికల్స్ సంస్థలో ఇళవరసి, ఆమె బంధువు కులోత్తుంగన్‌ లు డైరెక్టర్లు. ఇక చెన్నైలోని నీలాంగరైలోని శశికళ బంధువు భాస్కరన్‌ ఇంట్లో లెక్క చూపని 7 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్నార్‌ గుడిలో శశికళ సోదరుడు దివాకరన్‌ నిర్వహిస్తున్న సెంగమళతాయార్‌ మహిళా కళాశాల విడిది గృహంలో 25 లక్షల రూపాయల నగదు, 6 రోలెక్స్‌ గడియారాలు, బంగారం తదితరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక శశికళకు చెందిన 315 బ్యాంకు ఖాతాలనూ స్తంభింపజేసినట్లు తెలుస్తోంది.

More Telugu News