Donald Trump: చైనా దాటగానే భారత్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ చైనాపై ట్రంప్ విమర్శలు

  • ఏపీఈసీ సదస్సులో ప్రసంగించిన ట్రంప్
  • ఇండియా ఆర్థిక వృద్ధి భేష్
  • మోదీ నిర్ణయాలు పెట్టుబడులకు అనుకూలం
  • పనిలో పనిగా చైనాపై ఆగ్రహం

ప్రస్తుతం వియత్నాం పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఏపీఈసీ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తూ, ఇండియాను పొగడ్తలతో ముంచెత్తారు. భారత్ లో ఆర్థిక వృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందని కితాబిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంస్కరణలు ఆ దేశాన్ని విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా మార్చాయని అన్నారు.

భారతీయులందరినీ ఏకం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయని అన్నారు. ఇండియా తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని, ఇండియాతో వియత్నాం మరింత బలమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని అన్నారు. పశ్చిమ పసిఫిక్ దేశాలు ఒకటిగా కలిసి అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇదే సమావేశంలో చైనాపై తన ఆగ్రహాన్ని కూడా ట్రంప్ వ్యక్తం చేశారు.

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలను చైనా అతిక్రమిస్తోందని ఆరోపించారు. చైనా తన ఉత్పత్తులను అమెరికాలో అమ్ముకుంటోందని, అమెరికన్ ప్రొడక్టులను మాత్రం తమ దేశంలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాగా, ట్రంప్ చైనా పర్యటనను ముగించుకుని మరో దేశంలోకి ప్రవేశించిన తరువాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

More Telugu News