ap assembly: ఏపీ అసెంబ్లీ వద్ద భారీ భద్రత.. గన్ మెన్లు కూడా లోపలకు వెళ్లలేరు!

  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు
  • వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా అనుమతి లేదు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. విపక్షం లేకుండానే సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ వైపు వచ్చే అన్ని మార్గాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, పది కిలోమీటర్ల పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు.

పోలీసు అధికారుల మెడలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. క్యూఆర్టీ బృందాలను రంగంలోకి దించారు. ప్రజాప్రతినిధుల డ్రైవర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అనుచరులను కూడా అసెంబ్లీలోకి అనుమతించడం లేదు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముందస్తు అనుమతులు పొందినవారిని మాత్రమే అసెంబ్లీ పరిసరాల్లోకి అనుమతిస్తున్నారు. 4వ నెంబర్ గేటు వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. 

More Telugu News