jaipur airport: నా డ్యూటీ టైం అయిపోయిందంటూ వెళ్లిపోయిన పైలట్... ప్రయాణికులను బస్సెక్కించిన ఎయిర్ ఇండియా!

  • జైపూర్ నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్ విమానం
  • తన పని సమయం ముగిసిందని వెళ్లిపోయిన పైలట్
  • బస్సులో వెళతామన్న వారికి ఏర్పాట్లు చేసిన ఏఐ
  • డీజీసీఏ నిబంధనలు అలా ఉన్నాయన్న డైరెక్టర్ జేఎస్ బల్ హరా

తాను డ్యూటీ చేయాల్సిన సమయం ముగిసిందని చెబుతూ, జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం పైలట్ విమానాన్ని వదిలేసి వెళ్లిపోగా, మరో పైలట్ అందుబాటులో లేని స్థితిలో వారందరినీ బస్సులో ఢిల్లీకి పంపాల్సి వచ్చింది. ఈ ఘటన ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా అనుబంధ అలయన్స్ ఎయిర్ విమానంలో జరిగింది.

తాను అలసిపోయానని, ఇక విమానం నడపలేనని చెబుతూ పైలట్ వెళ్లిపోగా, 40 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయం చూపాల్సిన స్థితిలో, వారిని ఢిల్లీకి రహదారి మార్గంపై పంపారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. ప్రయాణికులను సంప్రదించిన మీదటే, బస్సులో వెళతామని చెప్పిన వారిని పంపించామని, అందుకు అంగీకరించని వారికి హోటల్ రూమ్స్ ఏర్పాటు చేశామని, కొందరిని ఈ ఉదయం విమానాల్లో ఖాళీ సీట్లను బట్టి పంపుతున్నామని అధికారులు తెలిపారు.

డీజీసీఏ నిబంధనల మేరకు పనిచేయాల్సిన సమయం పూర్తయిన తరువాత ఏ పైలట్ కూడా విధుల్లో కొనసాగేందుకు వీల్లేదని జైపూర్ విమానాశ్రయం డైరెక్టర్ జేఎస్ బల్ హరా తెలిపారు. కాగా, ఈ విమానం చివరి ట్రిప్ జైపూర్ నుంచి ఢిల్లీకి వేయాల్సి వుండగా, ఢిల్లీ నుంచి వచ్చేసరికే ఆలస్యం అయింది. ఈ పరిస్థితుల్లో పైలట్ తన విధులను కొనసాగించేందుకు నిరాకరించాడని వెల్లడించారు.

More Telugu News