Hyderabad: బంజారాహిల్స్ లోని 11 కోట్ల స్థలాన్ని 5050 రూపాయలకు కొట్టేసే ప్లాన్!

  • 505 గజాల స్థలాన్ని గజం 10 రూపాయల చొప్పున తమకు కేటాయించాలంటున్న మహిళా న్యాయవాది
  • భూమి ధర 11 కోట్లుగా తేల్చిన అధికారులు
  • కలెక్టర్లు, సచివాలయం మధ్య వివాదం
  • జీవో చూపించాలంటున్న కలెక్టర్లు

హైదరాబాదులోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 1లోని టీఎస్‌ నంబరు 14లోని 505 గజాల స్థలానికి రెక్కలొస్తున్నాయని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌ లో 11 కోట్ల రూపాయల విలువైన ఆ స్థలాన్ని ఒక మహిళా న్యాయవాది కేవలం 5050 రూపాయలకే దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జారీ అయిన జీవో 1135 ఆధారంగా గజం 10 రూపాయల చొప్పున తమకు కేటాయించాలని ఆమె కలెక్టరేట్‌ కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో తన తండ్రి ఒకప్పుడు అడ్వకేట్‌ జనరల్‌ గా పనిచేశారని, అప్పటి ప్రభుత్వం తమకు అలాంటి అవకాశం ఇచ్చిందని దరఖాస్తులో ఆమె తెలిపారు.

అయితే ఈ దరఖాస్తును క్లియర్ చెయ్యాలని గతంలో హైదరాబాదు కలెక్టర్లుగా పని చేసిన మీనా, విజయ, రాహుల్‌ బొజ్జాలకు సచివాలయం నుంచి ఒత్తిళ్లు వచ్చినా వారే నిర్ణయం తీసుకోలేదు. గజం స్థలం 10 రూపాయలకే కేటాయించే జీవో ఇంతవరకు రాలేదని, ఒకవేళ జారీ అయినా, దానికి సంబంధించి ఎలాంటి సమాచారం తమవద్ద లేదని తేల్చి చెప్పారు. సచివాలయ అధికారి ఆదేశాలతో ఈ స్థలం న్యాయవాదికి కట్టబెడుతున్నట్టు ఉన్న ఫైల్ పై రాహుల్ బొజ్జా సంతకం చేశారు కానీ, ఆదేశాలివ్వలేదు. ఆ తరువాత ఆయన ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లారు. అదే సమయంలో యోగితారాణా కలెక్టర్‌ గా బాధ్యతలు స్వీకరించారు.

ఆమెపై కూడా సచివాలయం నుంచి ఒత్తిడి ఉండడంతో న్యాయవాది దరఖాస్తు, స్థలం, ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, అత్యంత ఖరీదైన ఆ స్థలాన్ని 5050 రూపాయలకు కేటాయించడం కుదరదని స్పష్టంగా చెప్పారు. ప్రజావసరాలకు ఉపయోగపడే ఆ స్థలాన్ని ఏ ప్రాతిపాదికన కేటాయించాలని కోరుతున్నారో సూచించాలని కోరుతూ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. అయినప్పటికీ 10 రూపాయలకే గజం స్థలం కేటాయించాలన్న జీవో చూపిస్తే మరో చోట ఆమెకు భూమి కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఆ 505 గజాల స్థలంపై అన్నిహక్కులు ప్రభుత్వానివే అయినప్పటికీ తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో దానిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 

  • Loading...

More Telugu News